డీఈఓకు వినతి
గుంటూరు ఎడ్యుకేషన్: పాఠశాలలు పునః ప్రారంభమైన తరుణంలోనే పదో తరగతి విద్యార్థులకు రోజువారి పరీక్షలను నిర్వహించాలనే విద్యా శాఖ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.బసవలింగారావు, జిల్లా శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గుడిపాటిదాస్, మొహమ్మద్ ఖాలిద్ డిమాండ్ చేశారు. మంగళవారం డీఈఓ కార్యాలయంలో జిల్లా విద్యా శాఖ అధికారి షేక్ సలీమ్‌బాషాను కలిసి వినతి పత్రం అందజేశారు. నాయకులు మాట్లాడుతూ విద్యా సంవత్సరం ప్రారంభంలో పాఠ్యాంశాలను చాప్టర్ వైజ్‌గా బోధించాల్సిన సమయంలో రోజువారి పరీక్షలు నిర్వహించడం వలన ప్రశ్న, సమాధానాలుగా తరగతులు మారిపోతాయని అన్నారు. రోజువారి పరీక్షలను ఉపసంహరించుకుని వారంతపు పరీక్షలు నిర్వహించే విధంగా ఉపాధ్యాయులకు స్వేచ్ఛనివ్వాలన్నారు. డీఈఓను కలిసిన వారిలో ఏపీ టీఎఫ్ ఫిరంగిపురం, పొన్నూరు మండల శాఖల అధ్యక్షులు జహంగీర్, వి.కిషోర్‌షా, పేరేచర్ల హైస్కూల్ హెచ్‌ఎం పి.రంగరాజు ఉన్నారు.


