పోలీసంటే.. అలుసు! | - | Sakshi
Sakshi News home page

పోలీసంటే.. అలుసు!

Apr 7 2026 7:49 AM | Updated on Apr 7 2026 7:49 AM

● గత నెలలో హెడ్‌ కానిస్టేబుల్‌పై దాడి ● తాజాగా మద్యం తాగడంపై ప్రశ్నించినందుకు ఎస్‌ఐపై ఎదురుదాడి ● కూటమి నేతల దన్నుతోనే లెక్కలేనితనమంటూ జనం విమర్శలు ● చంద్రబాబు ప్రభుత్వంలో పోలీసులకే భద్రతలేదంటూ చర్చ తెనాలిలో పోలీసులపై కూటమి నేతల వరుస దాడులు ● గత సంవత్సరం టూ టౌన్‌ పరిధిలో రాత్రిపూట వన్‌టౌన్‌ కానిస్టేబుల్‌పై దాడిచేశారంటూ ముగ్గురు దళిత యువకులను అదేరోజు అర్ధరాత్రి ప్రాంతంలో తెనాలి, మంగళగిరి నుంచి అదుపులోకి తీసుకున్నారు. ఆ కేసులో ప్రథమ నిందితుడు మినహా మిగిలిన ముగ్గురిని నడిరోడ్డుపై పోలీసు అధికారులే అరికాళ్లపై లాఠీఛార్జీ చేయటం అప్పట్లో సంచలనం కలిగించింది. తర్వాత ప్రధాన నిందితుడిని కూడా పోలీసులు అరెస్టు చేశారు. మరి, ప్రభుత్వ ఆసుపత్రిలో పట్టపగలు విధినిర్వహణలో ఉన్న హెడ్‌కానిస్టేబుల్‌పై గత నెలలో దాడిచేసిన నిందితుడిని ఇప్పటివరకు అరెస్టు చేయలేదు. మళ్లీ ఇప్పుడు పట్టణ నడిబొడ్డులో బోసురోడ్డులో పోలీసుల సమక్షంలోనే ఎస్‌ఐపై దాడిజరిగింది. కూటమి పార్టీల నేతల దన్నుతోనే.. ఇలా పోలీసులంటే లెక్కలేకుండా పోతోందన్న విమర్శలు వస్తున్నాయి.

అతీగతీలేని హెడ్‌ కానిస్టేబుల్‌పై దాడి కేసు

చంద్రబాబు ప్రభుత్వంలో ప్రజలకు భద్రత కల్పించాల్సిన పోలీసులకే భద్రత లేకుండా పోతోంది. కూటమి నేతల అండ చూసుకుని చోటా మోటా నాయకులు సైతం పోలీసులను బెదిరించడం.. దుర్భాషలాడడం.. దాడులకు సైతం పాల్పడడం పరిపాటిగా మారింది. తెనాలిలో నెల రోజుల వ్యవధిలో జరిగిన రెండు సంఘటనలు పోలీసులపై కూటమి నేతల దాష్టికానికి నిదర్శనాలుగా మారాయి. గత నెలలో జనసేన నాయకుడు హెడ్‌ కానిస్టేబుల్‌పై దాడిచేయగా.. తాజాగా నడిరోడ్డుపై మద్యం తాగవద్దని వారించిన ఎస్‌ఐపై టీడీపీకి చెందిన వ్యక్తులు మూకుమ్మడిగా దాడికి పాల్పడడం సంచలనంగా మారింది.

తెనాలి: చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గుంటూరు జిల్లా తెనాలిలో పోలీసులపై దాడులు పెచ్చరిల్లుతున్నాయి. కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు విధినిర్వహణలో ఉన్న పోలీసులపై యథేచ్ఛగా దాడి చేస్తున్నారు. తాజాగా రద్దీగా ఉండే ప్రధాన రహదారి కూడలిలో మద్యం సేవిస్తూ, అదేమని అడిగిన ఎస్‌ఐపై దాడి చేయడం ఇందుకు నిదర్శనం. గతేడాది ఓ కానిస్టేబుల్‌పై దాడిచేశారంటూ ముగ్గురు దళిత యువకులను బహిరంగంగా పోలీసు అధికారులే భౌతిక హింసకు పాల్పడిన విషయం తెలిసిందే. గత నెలలో హెడ్‌కానిస్టేబుల్‌పై దాడిచేసిన నిందితుడిని ఇప్పటికీ అరెస్టు చేయలేదు.

అసలేం జరిగిందంటే..

పట్టణంలోని సమైక్య వెండి వృత్తిదారుల సంఘం అధ్యక్షుడు పఠాన్‌ ఫజల్‌ఖాన్‌ జన్మదిన వేడుకలను ఆదివారం మధ్యాహ్నం బోసురోడ్డులో ఘనంగా నిర్వహించారు. టీడీపీ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, గుంటూరు తూర్పు టీడీపీ ఎమ్మెల్యే నసీర్‌ అహ్మద్‌ల ఫ్లెక్సీలతో తమ నాయకుడి ఫొటోతో కూడి న భారీ ఫ్లెక్సీని నడిరోడ్డు కూడలిలో ఏర్పాటుచేసి, జన్మదిన కేక్‌ను కట్‌ చేసి, వేడుక జరిపారు. అదేరోజు సాయంత్రం ఆ ఫ్లెక్సీని పట్టణంలో ఊరేగించేందుకని కొందరు వర్కర్లు ఆ కూడలికి చేరుకుని, తమ నాయకుడి పేరుతో అక్కడే జేజేలు చేస్తున్నారు. అక్కడికి సమీపంలోని గాంధీచౌక్‌లో ట్రాఫిక్‌ విధుల్లో ఉన్న వన్‌టౌన్‌ ఎస్‌ఐ కె.విజయ్‌కుమార్‌కు రోడ్డుపైనే యువకులు మద్యం సేవిస్తున్నారనే సమాచారం వచ్చింది. దీంతో ట్రాఫిక్‌ ఎస్‌ఐ బ్రహ్మయ్య, కానిస్టేబుల్‌ కృష్ణమూర్తి, హోంగార్డ్‌ రాజుతో కలిసి ఎస్‌ఐ విజయకుమార్‌ అక్కడకు చేరుకున్నారు. పోలీసులను చూసి పరారయ్యేందుకు ప్రయత్నించినవారిలో ముగ్గురిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పరారయ్యేందుకు ప్రయత్నించినవారు వెనక్కివచ్చారు. నడిరోడ్డుపై మద్యం సేవించటం చట్టప్రకారం నేరం అని ఎస్‌ఐ విజయ్‌కుమార్‌ చెబుతుండగానే ఆయనపై దాడిచేశారు. రోడ్డుపైకి తోసివేసి పరారయ్యారు. ఈ ఘటనను పోలీసుల్లో ఒకరు రికార్డు చేశారు కూడా! దీనిపై వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషనులో కేసు నమోదుచేశారు. నిందితుల్లో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. మిగిలినవారికోసం గాలిస్తున్నారని తెలిసింది.

ఇదిలావుంటే గత నెల రెండోవారంలో త్రీటౌన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఇద్దరు వ్యక్తులు ఘర్షణపడ్డారు. బీరు సీసాతో జరిగిన దాడిలో ఇండ్ల వెంకట్రావు అనే వ్యక్తి గాయపడ్డాడు. క్షతగాత్రుడిని చెంచుపేటలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెడికో లీగల్‌ కేసుగా త్రీటౌన్‌ పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన సమాచారం ప్రకారం ఆసుపత్రి డ్యూటీలో ఉండే త్రీటౌన్‌ హెడ్‌కానిస్టేబుల్‌ టి.తిరుమలరావు, క్షతగాత్రుడి దగ్గరకు వెళ్లి వివరాలు నమోదు చేసుకుంటున్నారు. అదే సమయంలో జనసేన పార్టీ నాయకుడు ఎయిర్‌టెల్‌ నాగేశ్వరరావు వెంకట్రావుపై దాడిచేసిన వ్యక్తిని వెంటబెట్టుకుని ఆసుపత్రికి చేరుకున్నారు. తిరుమలరావు దగ్గరకు వెళ్లి, ‘మావాడిని కూడా కొట్టారు. ముందు మా వాడు చెప్పిన వివరాలు తీసుకోండి’ అంటూ హుకూం జారీ చేశాడు. అది వీలుపడదని చెప్పిన హెడ్‌ కానిస్టేబుల్‌ తిరుమలరావుతో ఘర్షణపడి అక్కడే అతడిపై దాడిచేశాడు. దీనిపై తిరుమలరావు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం త్రీటౌన్‌ పీఎస్‌లో 42/2026 కేసు నమోదైంది. నిందితుడు ఎయిర్‌టెల్‌ నాగేశ్వరరావును ఇప్పటివరకూ అరెస్టు చేయలేదని తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement