గుంటూరు మెడికల్ ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు... ఆరోగ్యం లేకపోతే కోట్లాది రూపాయలు ఉన్నా సుఖం లేనట్లే . ప్రపంచ ఆరోగ్య సంస్థ 1948లో మొట్టమొదటిసారిగా వరల్డ్ హెల్త్ అసెంబ్లీని ఏర్పాటు చేసింది. ప్రతి ఏడాదీ ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహించాలని ఈ అసెంబ్లీ 1950లో తీర్మానించింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలకు ఆరోగ్యంపై అవగాహన కల్పించి, అందరూ ఆరోగ్యంగా జీవించేలా చేయటం దీని ముఖ్యోద్దేశం. రోగాలు వచ్చిన తర్వాత వైద్యుల వద్దకు పరుగులు తీయటం కంటే ముందస్తుగా వైద్యులు చెప్పే సూచనలు, సలహాలు పాటించటం మంచిది. గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో 2025 సంవత్సరంలో 15,41,439 మంది రోగులు వివిధ రకాల వ్యాధులతో వైద్యసేవలు పొందారు. వైద్యుల సూచనలు ఆచరిస్తే కొంత వరకు వ్యాధుల బారినుండి కాపాడుకునే అవకాశం కలుగుతుంది. మంగళవారం ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం.
శరీరంలోని అన్ని అవయవాల్లో గుండె ప్రధానమైంది. గుండె కోసం తప్పని సరిగా ప్రతి రోజూ వ్యాయామం చేయాలి. మంచి ఆహారపు అలవాట్లు కలిగి ఉండాలి. నూనె అధికంగా ఉండే పదార్థాలు, చికెన్, మాంసం లాంటి కొవ్వు అధికంగా ఉండే పదార్థాలను తినకూడదు. ఆకుకూరలు, కాయగూరలు తీసుకోవాలి. ఉప్పును సాధ్యమైనంత తక్కువగా వినియోగించాలి. బీపీ, షుగర్‌లను నియంత్రణలో పెట్టుకోవాలి. ధూమపానం, మద్యపానం లాంటి చెడు వ్యసనాల జోలికి వెళ్లకూడదు. ఒత్తిడి లేకుండా ఉండాలి.
–డాక్టర్ బి.వి.నారాయణరెడ్డి , ఇంట్రవెన్షనల్ కార్డియాలజిస్టు, గుంటూరు
కాళ్లవాపులు, మూత్రం ఎక్కువసార్లు రావటం, మూత్రంలో మంట రావటం, మూత్రంలో రక్తం కారటం, ఆకలి లేకపోటం, వాంతులు అవ్వటం తదితర లక్షణాలు కన్పిస్తే మూత్ర పిండాలకు వ్యాధి సోకినట్లు అర్థం చేసుకోవాలి. కుటుంబంలో ఒకరికి ఉంటే వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా ముందస్తుగా పరీక్షలు చేయించుకోవటం మంచిది. నొప్పి మాత్రలు ఎక్కువగా వాడటం, నాటుమందులు వాడటం, బీపీ, షుగర్‌లు అదుపులో లేకపోవటం వల్ల మూత్రపిండాలు పాడవుతాయి. బీపీ, షుగర్‌లు ఉన్నవారు ప్రతి 6 నెలలకు ఒకసారి కిడ్నీ పరీక్షలు చేయించుకోవాలి.
– డాక్టర్ చింతా రామకృష్ణ,
సీనియర్ నెఫ్రాలజిస్ట్, గుంటూరు
సీ్త్రకి కాన్పు పునర్జన్మలాంటిది. గర్భం దాల్చినది మొదలుకొని కాన్పు అయ్యే వరకు శరీరంలో వివిధ రకాల మార్పులు సంభవించటంతోపాటు, వివిధ రుగ్మతలు తలెత్తే అవకాశం ఉంది. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా పుట్టబోయే బిడ్డతోపాటు తల్లి కూడా కాన్పు సమయంలో మృతి చెందే అవకాశం ఉంది. గర్భిణీ అని నిర్ధారణ జరిగినది మొదలుకొని కాన్పు వరకు తప్పని సరిగా వైద్యుల సలహాలు, పాటించాలి. రక్తపోటు, రక్తహీనత రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆకుకూరలు, పాలు, గుడ్లు, పప్పుధాన్యాలు, ఇతర పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. కాన్పులు తప్పని సరిగా ఆస్పత్రుల్లోనే జరిగేలా చర్యలు తీసుకోవాలి
–డాక్టర్ బూసిరెడ్డి దీప్తిరెడ్డి, సీ్త్ర, ప్రసూతి,
సంతాన సాఫల్య వైద్య నిపుణురాలు, గుంటూరు


