తెనాలిరూరల్: రైలు కింద పడి వృద్దుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన చుండూరు సమీపంలో శనివారం జరిగింది. బాపట్ల జిల్లా అమృతలూరుకు చెందిన కొల్లూరి వీరరాఘవులు(70) చుండూరు స్టేషన్ సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న జీఆర్పీ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని వైద్యశాలకు తరలించారు. ఎస్‌ఐ ఎల్.సరస్వతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గలకారణాలను దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.
లక్ష్మీపురం: వృద్ధులను ఎంచుకుని వారి వద్దకు వెళ్లి ఫేక్ యాప్ ద్వారా నగదును ఫోన్ పే చేస్తున్నట్లు చెప్పి వారి నుంచి భారీ మొత్తంలో నగదు తీసుకుని మోసం చేసే యువకుడిని పట్టాభిపురం పోలీసులు శనివారం రాత్రి అరెస్ట్ చేశారు. పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా ఎస్పీ వకుల్ జింధాల్ ఆదేశాల మేరకు శుక్రవారం రాత్రి పట్టాభిపురం పోలీస్‌స్టేషన్‌లో సెక్షన్ ఇన్‌చార్జిగా ఉన్న హెడ్ కానిస్టేబుల్ స్వర్ణసింగ్, కానిస్టేబుల్ కొల్లి శ్రీనివాసరావు, జమ్ముల శ్రీనివాసరావులు పోలీస్‌స్టేషన్ పరిధిలో ఫింగర్ ప్రింట్ డివైజ్‌తో వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. అదే సమయంలో రాజుపాలెం మండలం అంచులవారిపాలెంకి చెందిన వేపూరి శరత్‌బాబు వేలిముద్రలు పరిశీలించగా గతంలో కేసులు ఉన్నట్లు గమనించి స్టేషన్‌కు తరలించారు. సీఐ గంగా వెంకటేశ్వర్లు విచారించగా అతనిపై తెలుగు రాష్ట్రాలలో సుమారు 35కి పైగా కేసులు ఉన్నట్లు తేలింది. మొబైల్‌లో ఫేక్ యాప్ డౌన్‌లోడ్ చేసి వృద్ధులు ఎంచుకుని మెడికల్ షాపులు, పెట్రోల్ బంక్‌లతోపాటు వ్యాపార సముదాయాల వద్దకు వెళ్లి ఫోన్ పే, గూగుల్ పేలో నగదు ఉన్నట్లు చూపించి పదివేలు నగదు ఇస్తే వెయ్యి రూపాయాలు కమీషన్ కలిపి యాప్ ద్వారా నగదు జమ చేస్తానని నమ్మబలికి వారి వద్ద నగదు తీసుకుని అక్కడ నుంచి జారుకుంటాడు. కొద్ది సేపటి తరువాత నగదు ఇచ్చిన వారు ఖాతాలో పరిశీలించగా ఎలాంటి నగదు జమ కాకపోవడంతో మోసపోయినట్లు గుర్తిస్తున్నారు. ఫింగర్ ప్రింట్ డివైజ్ ద్వారా నేరస్తులను పట్టుకోవడం అభినందనీయం అన్నారు.


