మంగళగిరి టౌన్: మంగళగిరి ఎయిమ్స్‌లో శనివారం అధునాతన ఆటోమేటెడ్ ట్రాన్స్ ఫ్యూజన్, ట్రాన్స్‌మిసిబుల్ ఇన్ఫెక్షన్స స్క్రీనింగ్ సిస్టమ్‌ను ఎయిమ్స్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ అహంతమ్ శాంతాసింగ్ ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలో మొట్టమొదటగా మంగళగిరి ఎయిమ్స్‌లో ఈ పరికరాలు ప్రారంభించినట్లు తెలిపారు. ఈ న్యూక్లియర్ సిస్టమ్‌లో 50 నుంచి 100 బ్లడ్ శాంపిల్స్‌ను టెస్టింగ్ చేయవచ్చని, ఏడాదికి 60 వేల నుండి లక్ష వరకు పరీక్షలు చేయవచ్చని తెలిపారు. హెచ్‌ఐవి, హెపటైటిస్ బీ, హెపటైటిస్ సి వంటి ఇన్ఫెక్షన్లను ఈ పరికరాల ద్వారా ముందుగా గుర్తించవచ్చని తెలియజేశారు. సుమారు రూ.1.7 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన ఈ పరికరాల వల్ల ఎయిమ్స్ మరో ముందడుగు వేసిందని తెలియజేశారు. ఈ అధునాతన వ్యవస్థ ఆంధ్రప్రదేశ్, ఇతర రాష్ట్రాలలోని రోగులకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో మెడికల్ సూపరింటెండెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రాజశేఖర్ మోహన్, డిప్యూటీ డైరెక్టర్ కల్నల్ శశికాంత్, అదనపు ప్రొఫెసర్ డాక్టర్ చైతన్యకుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అనీలా మణి తదితరులు పాల్గొన్నారు.


