పెదకాకాని: నంబూరు వాసిరెడ్డి వెంకటాద్రి ఇంటర్నేషనల్ టెక్నలాజికల్ యూనివర్సిటీలో ఆంధ్రప్రదేశ్ ఆర్చరీ అసోసియేషన్ ఆధ్వర్యంలో చెరుకూరి లెనిన్ వోల్గా మెమోరియల్ నేషనల్ ఆర్చరీ చాంపియన్‌షిప్ పోటీలు శుక్రవారం ఘనంగా ప్రారంభం అయ్యాయి. పోటీలు ఏప్రిల్ 7వ తేదీ వరకు విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో జరగనున్నాయి. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 2,300 మంది ఆర్చరీ క్రీడాకారులు, కోచ్‌లు రానున్నారు. అండర్ 10, అండర్ 13, అండర్ 15 విభాగాలుగా నిర్వహించనున్న పోటీలలో తొలి రోజున 723 మంది పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆర్చరీ అసోసియేషన్ ప్రెసిడెంట్ నందమూరి తేజస్విని, ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ (శాప్) ఎండీ ఎస్.భరణి, ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ లక్షీశా, వీవీఐటీయూ చాన్సలర్ వాసిరెడ్డి విద్యాసాగర్‌లు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. వర్సిటీ చాన్సలర్ వాసిరెడ్డి విద్యాసాగర్ మాట్లాడుతూ ఆర్చరీ వంటి క్రీడలు విద్యార్థులలో ఏకాగ్రతను, ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయని చెప్పారు. అలాంటి పోటీలకు తమ విశ్వవిద్యాలయం వేదిక కావడం గర్వకారణమని పేర్కొన్నారు. వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ వై. మల్లికార్జునరెడ్డి, ఇండియన్ ఆర్చరీ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ చెరుకూరి సత్యనారాయణ, పీడీ ఎన్. అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


