తాడేపల్లి రూరల్: గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి రూరల్ పరిధిలోని ప్రాతూరు గుండిమెడ మధ్య వున్న చిన్నరహదారిలో కొంతమంది విద్యార్థులు మంగళవారం కారుతో హల్‌చల్ చేశారు. అతివేగంగా కారు నడిపి ఓ విద్యార్థి మృతికి కారణమవగా, మరో విద్యార్థినికి తీవ్ర గాయాలయ్యాయి. సేకరించిన వివరాల ప్రకారం... జాతీయ రహదారి వద్ద ప్రాతూరు అండ్‌పాస్ నుంచి ఒక కారు అతివేగంగా వస్తూ రోడ్డుపక్కనే ఉన్న వారిని భయభ్రాంతులకు గురిచేసి పలువుర్ని ఢీకొట్టేందుకు యత్నించగా వారు తప్పించుకున్నారు. ప్రాతూరు గ్రామం మలుపు నుంచి గుండిమెడ వస్తున్న సమయంలో ఆంధ్రరత్న పంపింగ్ స్కీం పంటకాలువ దాటిన తరువాత రోడ్డుపక్కనే అతివేగంగా వస్తున్న కారులో ఉన్న స్నేహితుల కారు ఆగి ఉంది. అదే వేగంతో ఆ కారును ఢీకొని ఆ పక్కనే ద్విచక్రవాహనంపై వెళుతున్న సంపత్‌రెడ్డి (17), అనే ఇంటర్ విద్యార్థిని, మరో విద్యార్థినిని ఢీకొనడంతో సంపత్‌రెడ్డి ఎగిరి రోడ్డుపై పడ్డాడు. ఏం జరిగిందో తెలియదు కానీ సంపత్‌రెడ్డి మొహం మొత్తం నలిగిపోయింది. వాహనం వెనుక ఉన్న విద్యార్థినికి కాలు, చెయ్యి విరగడంతో 108లో స్థానికులు ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఆ విద్యార్థిని వివరాలు చెప్పేందుకు, కేసు పెట్టేందుకు ముందుకు రాలేదు. కారుతో ఢీకొట్టిన విద్యార్థిని స్థానికులు పట్టుకోగా, అదే కారులో వున్న విద్యార్ధి, విద్యార్థినులు మరో కారులో ప్రాతూరు వైపు పరారవుతుండగా రోడ్డు ప్రమాదాన్ని పరిశీలించిన యువకులు ఆపేందుకు ప్రయత్నించారు. వారిని సైతం కారుతో నెట్టుకుంటూ అక్కడి నుంచి పరారయ్యారు.
అనంతరం కారులో ప్రయాణిస్తున్న ఒక విద్యార్థి తల్లిదండ్రులు వచ్చి ప్రమాదం జరిగిన విషయాన్ని కనుక్కోకుండా వారి కొడుకుని కాపాడుకునేందుకు యత్నించడంతో స్థానికులు ఆయన వచ్చిన కారు అద్దాలను పగలకొట్టారు. పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి కారు నడిపిన విద్యార్థితో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. స్థానికులు మాత్రం వారందరూ మత్తులో ఉన్నారని, గంజాయి తాగారా, మద్యం సేవించారా అన్నది తెలియరావడం లేదని, జరిగిన సంఘటనపై సక్రమమైన విచారణ చేసి విద్యార్థి మృతికి కారణమైన వారందరినీ కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.


