గుంటూరు వెస్ట్ (క్రీడలు): జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలోని త్రీమెన్ కమిటీ సారధ్యంలో ఈ నెల 29 ఉదయం 7:30 గంటలకు అరండల్ పేట 10/3 శ్రీ మాజేటి గురవయ్యా హైస్కూల్ గ్రౌండ్‌లో అండర్–19 యువకుల క్రికెట్ ఎంపిక నిర్వహిస్తామని కమిటీ సభ్యుడు యు.మహతి శంకర్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సెప్టెంబర్ 1, 2007 తర్వాత జన్మించిన వారు అర్హులన్నారు. ప్లేయర్స్ వైట్ డ్రెస్‌తోపాటు సొంత కిట్ బాగ్‌తో రిపోర్ట్ చేయాలన్నారు. డిజిటల్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్స్, ఆధార కార్డ్ ఒరిజినల్, జిరాక్స్ కాపీ తో రిపోర్ట్ చేయాలన్నారు.
పులిపాక హైస్కూల్ ఇన్‌చార్జి హెచ్‌ఎం సస్పెన్షన్
గుంటూరు ఎడ్యుకేషన్: మధ్యాహ్న భోజన విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే కారణంతో పొత్తూరువారితోటలోని పులిపాక ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఇన్‌చార్జి హెచ్‌ఎంను సస్పెండ్ చేసినట్లు జిల్లా విద్యాశాఖాధికారి షేక్ సలీమ్ బాషా మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. సోమవారం సంబంధిత పాఠశాలను తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే ఎండీ నసీర్ అహ్మద్ తనిఖీ చేసిన సమయంలో పాఠశాలలో హాజరైన విద్యార్థుల కంటే అధిక సంఖ్యలో మధ్యాహ్న భోజనం చేసినట్లుగా రికార్డుల్లో నమోదు చేసిన సంఘటనపై ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో విచారణ జరిపించినట్లు పేర్కొన్నారు. జరిగిన సంఘటనను జిల్లా విద్యాశాఖాధికారి దృష్టికి తీసుకురావడంలో నిర్లక్ష్యం వహించిన ఇన్‌చార్జ్ హెచ్‌ఎంను సస్పెండ్ చేసిన డీఈవో సలీమ్ బాషా రెగ్యులర్ హెచ్‌ఎంతో పాటు ఎంఈవో–2కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు.
మందుబాబులకు మూడు రోజుల సేవాశిక్ష
చీరాల రూరల్: మద్యం తాగి జన సంచారంలో ద్విచక్ర వాహనాలు నడుపుతున్న 9 మందికి మంగళవారం సెకండ్ క్లాస్ న్యాయస్థానం మేజిస్ట్రేట్ నరహరి శ్రీనివాసరావు మూడు రోజులు పాటు కోర్టు ప్రాంగణాన్ని పరిశుభ్రం చేయాలంటూ సేవా శిక్ష విధించినట్లు టూటౌన్ సీఐ అశోక్ కుమార్ తెలిపారు. చీరాల టూటౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో ఐదుగురు, రూరల్ పోలీసు స్టేషన్ పరిధిలో ఇద్దరు, ఒన్‌టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో ఒకరు, వేటపాలెం పోలీసు స్టేషన్ పరిధిలో ఒకరు ఉన్నట్లు సీఐ తెలిపారు. ద్విచక్ర వాహనదారులు మద్యం తాగి వాహనాలు నడిపి ప్రమాదాల బారిన పడడమే కాకుండా వారి కుటుంబ సభ్యులను అనాథలుగా మార్చేందుకు దోహదం చేస్తోందని చెప్పారు. మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన కేసుల్లోని నిందితులకు న్యాయస్థానం రూ.10 వేల జరిమానా విధిస్తుందని చెప్పారు. అయితే వారిలో పరివర్తన తీసుకొచ్చేందుకు న్యాయమూర్తి వారిపై జాలి చూపించి సేవా శిక్ష విధించినట్లు తెలిపారు.


