గుంటూరు రూరల్: నగర శివారుల్లోని లాంఫాం వ్యవసాయ పరిశోధన స్థానం నందున్న ఏరువాక కేంద్రం ఆధ్వర్యంలో మంగళవారం జిల్లాస్థాయి సమన్వయ సంఘ సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి సహా పరిశోధన సంచాలకులు డాక్టర్ ఎన్.వి.వి.ఎస్ దుర్గాప్రసాద్ అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో విస్తరణ సంచాలకులు డాక్టర్ జి.శివనారాయణ మాట్లాడుతూ 2026–27లో చేపట్టబోతున్న కార్యక్రమాలకు కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకునేందుకు పంటలవారీగా సలహాలను, సూచనలు తెలిపారు. దత్తత గ్రామాల రైతుల ఆర్థిక స్థితిగతులను అధ్యయనం చేసి, వారి ఆర్థిక స్థితిగతులను మెరుగు పరిచేందుకు అవసరమైన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. ఏరువాక కేంద్రం సమన్వయకర్త డాక్టర్ ఎ.మనోజ్ మాట్లాడుతూ 2025–26 సంవత్సరంలో వివిధ పంటలలో చేపట్టిన చిరు సంచులు ఫలితాలను, క్షేత్ర పరిశీలనలను, జిల్లాలో వ్యవసాయ అనుబంధ శాఖలు ద్వారా నిర్వహించిన కార్యక్రమాలను వివరించారు. పలువురు శాస్త్రవేత్తలు, అధికారులు ఏరువాక కేంద్రం 2026–27 లో చేపట్టవలసి కార్యక్రమాలకు అవసరమైన సలహాలను అందజేశారు. విస్తరణ నిపుణురాలు డాక్టర్ శ్రీలతవాణి 2025–26లో చేపట్టిన కార్యక్రమాలు 2026–27లో చేపట్టవలసిన కార్యక్రమాల గురించి వివరించారు. రైతులకొరకు షెడ్యూల్డ్ కులాల ఉప ప్రణాళిక నిధులతో నువ్వులలో సమగ్ర యాజమాన్యంపై పుస్తక ఆవిష్కరణ జరిగింది. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి పద్మావతి, ఆత్మ పథక సంచాలకులు డి.వెంకటేశ్వర్లు, జిల్లా వనరుల కేంద్రం అధికారి సునీత, జిల్లా నీటిపారుదల శాఖ డీఈ, విత్తన ధ్రువీకరణ అధికారి సురేష్‌రెడ్డి, రిలయన్స్ ఫౌండేషన్ ఏరియా మేనేజర్ యాకోబు, పంటలవారీగా ప్రధాన శాస్త్రవేత్తలు, ఆర్‌ఈసి సభ్యులు, డి.ఎల్.సి.సి సభ్యులు, ఇన్నోవేటివ్ నెట్వర్క్ సభ్యులు, అభ్యుదయ రైతులు పాల్గొన్నారు.


