పంచాయతీ అభివృద్ధి అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వైవీడీ ప్రసాద్
తెనాలిటౌన్: జోన్–3 పంచాయతీ కార్యదర్శుల ప్రమోషన్లు పారదర్శకంగా జరిగాయని పంచాయతీ అభివృద్ధి అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వైవీడీ ప్రసాద్ పేర్కొన్నారు. స్థానిక కొత్తపేటలోని మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2024 సంవత్సరంలో గ్రేడ్–3 సంబంధించి ప్రమోషన్లు కల్పించగా కొందరు ఉద్యోగులు మే నెలలో కోర్టును ఆశ్రయించడంతో ప్రమోషన్లు నిలిచిపోయినట్లు చెప్పారు. ఇటీవల పదిరోజుల కిందట న్యాయస్థానం ఆ పిటిషన్ చెల్లదని కొట్టివేయడంతో పంచాయతీరాజ్‌శాఖ కమిషనర్ వెంటనే స్పందించి పంచాయతీరాజ్ శాఖలో చేస్తున్న సంస్కరణలకు అనుగుణంగా ప్రమోషన్లు కల్పించినట్లు తెలిపారు. గుంటూరు, ప్రకాశం జిల్లాల పరిధిలో 600మంది నష్టపోయినట్లు గుర్తుచేశారు. పంచాయతీరాజ్‌శాఖ కమిషనర్ తీసుకున్న నిర్ణయానికి అసోసియేషన్ పూర్తి మద్దతు తెలుపుతుందని వెల్లడించారు. కొందరు ఉద్యోగులు దుర్దేశపూర్వకంగా ప్రకాశం జిల్లాలో చేస్తున్న నిరసన దీక్షను ఖండించారు. సీనియారిటీ జాబితా ప్రకారం ప్రమోషన్లు కల్పించలేదన్న మాట అవాస్తవమని చెప్పారు. కోర్టు తీర్పు చూసికూడా వీరికి కనువిప్పు కలగలేదని ఆరోపించారు. పంచాయతీరాజ్ కమిషనర్‌పై నిందలు వేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ఉమ్మడి గుంటూరు జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు సయ్యద్ జాన్ పీరా మాట్లాడుతూ జీవోఎంఎస్ 91 ప్రకటించిన గ్రేడ్‌ల ప్రకారం పేస్కేల్ అమలు చేయాలని కోరారు. ఈ విధానం వలన 15వేల మంది లబ్ధి పొందుతారని చెప్పారు. గ్రేడ్–3 స్కేల్ అమలుపరచడం వలన 8,300 కుటుంబాలకు మేలు చేసిన వారవుతారని తెలిపారు. సమావేశంలో అసోసియేషన్ రాష్ట్ర పబ్లిసిటీ సెక్రటరీ పి.శ్రీనివాసరావు, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరి పి.శివాజీ, శ్రీకాకుళం జిల్లా సహా అధ్యక్షుడు జ్యోతి శ్రీనివాస్, డేటా ఎంట్రీ ఆపరేటర్ల అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.


