పార్టీ ఆందోళనలకు చంద్రబాబు భయపడుతున్నారు
●అందుకే పోలీసులతో అణచి వేయాలని చూస్తున్నారు
●కోటి సంతకాల పత్రాల తరలింపులో మీడియాతో తెనాలి మాజీ ఎమ్మెల్యే శివకుమార్
తెనాలి: చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణలో భాగంగా నియోజకవర్గంలో సేకరించిన 74 వేల సంతకాల పత్రాల తరలింపును తెనాలిలో అట్టహాసంగా నిర్వహించారు. స్థానిక బోసురోడ్డులోని చిట్టి ఆంజనేయస్వామి ఆలయం సెంటరులో ఏర్పాటైన ప్రత్యేక వేదికపై ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్ సీపీ తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించే కార్యక్రమాలను పోలీసులతో అణచివేయాలనీ, ఆపాలని పాలకవర్గాలు చూస్తున్నాయంటే ప్రజావ్యతిరేకతకు భయపడుతున్నాయన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయంపై ప్రజలనుంచి సేకరించిన సంతకాల పత్రాలను ప్రజల సమక్షంలో బాక్సుల్లో సర్ది, జిల్లా కేంద్రానికి తరలించే కార్యక్రమానికి ముందురోజునుంచీ పోలీసులు అభ్యంతరం పెట్టటం ఇందుకు ఉదాహరణగా చెప్పారు.
ప్రజల నుంచి అద్భుతమైన స్పందన...
మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయాలనే చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయం మంచిది కాదనే భావనతో ప్రజాభిప్రాయాన్ని తెలుసుకునేందుకు పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌జగన్‌మోహన్‌రెడ్డి కోటి సంతకాల సేకరణకు పిలుపునిచ్చినట్టు గుర్తుచేశారు. ఆ ప్రకారం గత అరవై రోజులుగా జరిపిన సంతకాల సేకరణకు అద్భుతమైన స్పందన లభించిందన్నారు. శిబిరాలు ఏర్పాటు చేసినా, ఇంటింటికీ వెళ్లినా ప్రజలు ముందుకొచ్చి స్వచ్ఛందంగా సంతకాలను చేశారని తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలు, వివక్షపై ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని చెప్పారు. అందుకే మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో ప్రైవేటుకు అమ్మేయాలని చూడటం తమకు ఆమోదయోగ్యం కాదని, పునఃసమీక్షించుకోవాలని ప్రజలు మాండేట్ ఇచ్చారని వివరించారు. సహకరించిన ప్రజలకు, సంతకాల సేకరణలో కృషిచేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాల నేతలకు శివకుమార్ ధన్యవాదాలను తెలియ జేశారు.
మేం అప్పుడు అభ్యంతరం పెట్టామా ?
సంతకాల పత్రాల తరలింపు ప్రక్రియను పోలీసులు ఆపాలని చూశారని చెబుతూ అదేమని అడిగితే రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా అనుమతి లేదన్నారని శివకుమార్ చెప్పారు. తాము అధికారంలో ఉన్నపుడు ప్రతిపక్షంలో ఉన్న కూటమి పార్టీలు ఆందోళన కార్యక్రమాలు చేసినపుడు అభ్యంతరపెట్టామా? అని ప్రశ్నించారు. మున్సిపల్ చైర్‌పర్సన్ తాడిబోయిన రాధిక, వైస్‌చైర్మన్ అత్తోట నాగవేణి, తెనాలి ఎంపీపీ ధర్మరాజుల చెన్నకేశవులు, కొల్లిపర మండల పార్టీ అధ్యక్షుడు కల్లం వెంకటప్పారెడ్డి, పార్టీ నాయకులు మైలా విజయ్‌నాయుడు, కొర్రా యశోద, కొంగర రాగమంజరి, షేక్ దుబాయ్‌బాబు, నిట్టా బాలు, కుర్రా శ్రీను పాల్గొన్నారు.


