వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై ప్రజల నుంచి తీవ్ర నిరసన
వైఎస్సార్‌సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణకు అనూహ్య మద్దతు ఇప్పటికే లక్ష్యాన్ని అధిగమించి.. కొనసాగిన సంతకాల సేకరణ గుంటూరు జిల్లాలో 4,78,059 సంతకాల సేకరణ నియోజకవర్గాల నుంచి జిల్లా కార్యాలయానికి సంతకాల పత్రాలు
మంగళగిరి నియోజకవర్గంలో
గుంటూరు ఎడ్యుకేషన్: ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం గుంటూరు జిల్లాలో విజయవంతమైంది. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు బుధవారం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి ప్రజలు సంతకాలు చేసిన పత్రాలను ఆయా నియోజకవర్గ సమన్వయకర్తలు, నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీలతో జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయానికి తీసుకొచ్చారు. వైద్య కళాశాలలు ప్రభుత్వ రంగంలోనే కొనసాగాలంటూ అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా సంతకాలు చేయడం ద్వారా తమ ఆకాంక్షను వెలిబుచ్చారు.
తెనాలి నియోజకవర్గంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా 75 వేల మంది సంతకాలు చేశారు. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త అన్నాబత్తుని శివకుమార్ నేతృత్వంలో బోసురోడ్డులోని చిట్టి ఆంజనేయస్వామి గుడి సెంటరు నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అనుబంధ కమిటీల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో ర్యాలీగా సాగారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదిక, వెనుక భారీ ఫ్లెక్సీ ఉంచారు. ఆ వేదికపై సంతకాలు చేసిన పత్రాల బాక్స్‌లను ఉంచారు. వాటిని ప్రత్యేక వాహనంలో గుంటూరుకు తరలించారు. వాహనాన్ని అన్నాబత్తుని శివకుమార్ స్వయంగా నడిపారు. మున్సిపల్ చైర్‌పర్సన్ తాడిబోయిన రాధిక, తెనాలి ఎంపీపీ ధర్మరాజుల చెన్నకేశవులు, తెనాలి రూరల్, కొల్లిపర మండలాల పార్టీ అధ్యక్షులు చెన్నుబోయిన శ్రీనివాసరావు, కల్లం వెంకటప్పారెడ్డి, అనుబంధ కమిటీల నాయకులు పాల్గొన్నారు.
గుంటూరు పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త, పార్టీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు నేతృత్వంలో సిద్ధార్థనగర్‌లోని క్యాంపు కార్యాలయం నుంచి బృందావన్ గార్డెన్స్‌రోడ్డులో ఉన్న పార్టీ జిల్లా కార్యాలయం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గంలో ప్రజలు సంతకాలు చేసిన 74,763 పత్రాలను బాక్సుల్లో ఉంచి, వాటిని ఆటోపై ప్రదర్శిస్తూ ర్యాలీ కొనసాగించారు. అంబటి రాంబాబు బుల్లెట్ నడుపుతూ బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. మిర్చి యార్డు మాజీ చైర్మన్ నిమ్మకాలయ రాజనారాయణ, కార్పొరేటర్లు, అనుబంధ విభాగాల నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్నారు.
గుంటూరు తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరి ఫాతిమా నేతృత్వంతో మంగళదాస్‌నగర్‌లోని కార్యాలయం నుంచి పార్టీ జిల్లా కార్యాలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. 65 వేల మందికిపైగా సంతకాలు చేయగా.. ఆ పత్రాలను కార్యాలయంలో అందజేశారు. ఇందులో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ప్రత్తిపాడు నియోజకవర్గ సమన్వయకర్త బాలసాని కిరణ్ కుమార్, పరిశీలకుడు గులాం రసూల్, ఐదు మండలాల కన్వీనర్లు, అనుబంధ విభాగాల నాయకులతో ఏటుకూరు బైపాస్ నుంచి జిల్లా పార్టీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. నియోజకవర్గంలో 68 వేల సంతకాలు సేకరించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు.
తాడికొండ నియోజకవర్గంలో సమన్వయకర్త వనమా బాల వజ్రబాబు నేతృత్వంలో 64 వేల మంది నుంచి సంతకాలు సేకరించారు. ఆ పత్రాలను ర్యాలీగా జిల్లా కార్యాలయానికి తీసుకువచ్చారు. నాలుగు మండలాలకు చెందిన పార్టీ కన్వీనర్లు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు భారీగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మంగళగిరి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ కార్యాలయం నుంచి నియోజకవర్గ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావుల ఆధ్వర్యంలో ప్రజల సంతకాలతో కూడిన పత్రాలను భారీ ర్యాలీగా పార్టీ నాయకులు, కార్యకర్తలు జిల్లా పార్టీ కార్యాలయానికి తరలించారు. పార్టీ కార్యాలయం నుంచి తెనాలి బైపాస్ ఫ్లయ్ ఓవర్ వరకు ర్యాలీ నిర్వహించారు. మంగళగిరి నియోజవర్గంలో 66,296 మంది సంతకాలు చేశారు. కార్యక్రమంలో మంగళగిరి పట్టణ ఉపాధ్యక్షుడు ఎస్.కె మాబు, తాడేపల్లి పట్టణ అధ్యక్షుడు బుర్రుముక్కు వేణుగోపాల సోమి రెడ్డి, మంగళగిరి మండల అధ్యక్షుడు నాలి వెంకటకృష్ణ, దుగ్గిరాల మండల అధ్యక్షులు తాడిపోయిన శివ గోపయ్య , రాష్ట్ర విభాగ నాయకులు, జిల్లా నాయకులు నియోజవర్గ విభాగ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై ప్రజల నుంచి తీవ్ర నిరసన


