వైద్య కళాశాలల ప్రైవేటీకరణ ఆపి తీరాల్సిందే
ప్రతి ఒక్కరి సంతకం డిజిటలైజేషన్ రూపంలో భద్రం చంద్రబాబు నిర్ణయం వెనక్కు తీసుకునే వరకు వైఎస్సార్ సీపీ ఉద్యమం ప్రైవేటుపరం చేస్తే మేం అధికారంలోకి రాగానే తిరిగి ప్రభుత్వ రంగంలోకే.. పేదవారికి ఉచిత వైద్యాన్ని దూరం చేస్తున్న చంద్రబాబు సర్కారు వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు, నగర అధ్యక్షురాలు నూరి ఫాతిమా ఏడు నియోజకవర్గాల నుంచి పార్టీ జిల్లా కార్యాలయానికి సంతకాల పత్రాలు
గుంటూరు ఎడ్యుకేషన్: ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటు రంగానికి అప్పగిస్తూ చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు తమ సంతకాల ద్వారా వ్యతిరేకిస్తున్నారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు అన్నారు. వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం పూర్తయిన సందర్భంగా బుధవారం గుంటూరు జిల్లాలోని ఏడు నియోజకవర్గాల నుంచి సంతకాల పత్రాలను బృందావన్ గార్డెన్స్ మెయిన్‌రోడ్డులోని వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయానికి తరలించారు. ఈ సందర్భంగా ఆయా నియోజకవర్గాల నుంచి పత్రాలను తీసుకువచ్చిన పార్టీ సమన్వయకర్తలు, నాయకులు, కార్యకర్తలకు అంబటి రాంబాబు అభినందనలు తెలిపారు. అనంతరం గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి భారీ ర్యాలీగా వచ్చిన నియోజకవర్గ సమన్వయకర్త, పార్టీ నగర అధ్యక్షురాలు షేక్ నూరిఫాతిమాతో కలిసి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. సంతకాల సేకరణ ప్రజా ఉద్యమానికి ప్రజల నుంచి స్పందన లభించినట్లు చెప్పారు. గత ప్రభుత్వంలో సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి తీసుకొచ్చిన వైద్య కళాశాలలను ప్రభుత్వ రంగంలో నుంచి తప్పించి, ప్రయివేటు వారికి కట్టబెడుతూ చంద్రబాబు తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. ప్రజలు సంతకాలు చేయడం ద్వారా తమ వ్యతిరేకతను తెలిపారన్నారు.
మా ప్రభుత్వం రాగానే ఆ నిర్ణయం వెనక్కు
వైద్య కళాశాలలను పీపీఈ విధానంలో ప్రైవేటు వారికి అప్పగిస్తే.. తాము అధికారంలోకి రాగానే వైద్య కళాశాలలను తిరిగి ప్రభుత్వ రంగంలోకి తెస్తామని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ప్రభుత్వ రంగంలో ఒక వైద్య కళాశాల, ఆస్పత్రిని నిర్మించేందుకు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఎంతో సదాశయంతో ముందుకు వెళ్లారని తెలిపారు. ఉద్యమంలో ఇది తొలి అడుగేనని, పీపీపీ విధానాన్ని వెనక్కు తీసుకోని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
సంతకాలన్నీ నిక్షిప్తం
వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజలు చేసిన సంతకాల పత్రాలు డిజిటలైజేషన్ చేసి భద్రపరుస్తున్నామని అంబటి చెప్పారు. ప్రతి పత్రంపై సంతకం చేసిన వారి పేరు, వారి సెల్ నంబరు ఉంటాయని, వాటని డిజిటల్ కాపీ రూపంలో భద్రపరుస్తామన్నారు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల నుంచి వచ్చిన సంతకాల పత్రాలను ఈ నెల 15వ తేదీన తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయానికి పంపుతామని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరేట్ ఎదుట చర్మకార వృత్తిదారుడు అచ్చియ్య వైద్య కళాశాలల ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా అంబటి రాంబాబు సమక్షంలో సంతకం చేశారు. వైసీపీ నగర అధ్యక్షురాలు షేక్ నూరిఫాతిమా మాట్లాడుతూ కోటి మంది సంతకాలు చేయడాన్ని చూసి, చంద్రబాబు ప్రభుత్వం వెన్నులో వణుకు పుడుతోందన్నారు. కార్యక్రమంలో మిర్చి యార్డు మాజీ చైర్మన్ నిమ్మకాయల రాజనారాయణ, అనుబంధ విభాగాల నాయకులు, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షుడు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


