అంతర్ జిల్లా దొంగలు అరెస్ట్
● పలు జిల్లాల్లో 150కి పైగా కేసులు
●19 గ్రాముల బంగారం, 740 గ్రాముల వెండి స్వాధీనం
●వివరాలు వెల్లడించిన డీఎస్పీ మురళీకృష్ణ
మంగళగిరి టౌన్: రాత్రిళ్లు ఇళ్లు కొల్లగొడుతున్న ముగ్గురు అంతర్‌జిల్లా దొంగలను మంగళగిరి రూరల్ పోలీసులు అరెస్ట్‌చేశారు. మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్ సర్కిల్ కార్యాలయంలో నార్త్ సబ్ డివిజన్ డీఎస్పీ మురళీకృష్ణ సోమవారం వివరాలను వెల్లడించారు. విశాఖపట్టణానికి చెందిన తోట శివకుమార్ (శివభవాని)పై రాష్ట్రంలో సుమారు 150కి పైగా చోరీ కేసులు ఉన్నాయి. విశాఖపట్టణానికి చెందిన తోట వరలక్ష్మి శివభవానికి భార్య. భార్యాభర్తలు ఇద్దరూ వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన షేక్ ఇంతియాజ్‌తో కలసి పలుచోట్ల దొంగతనాలు చేశారు. ఉదయం రెక్కీ నిర్వహించి రాత్రిళ్లు దొంతనానికి పాల్పడడంలో వీరు సిద్ధహస్తులు. అక్టోబర్‌లో తిరుపతి పోలీసులు పలు దొంగతనాల కేసులో శివకుమార్‌ను అరెస్ట్ చేసి కడప జైలుకు పంపించారు. కడప జైల్లో షేక్ ఇంతియాజ్ పరిచయమయ్యాడని, జైలు నుంచి విడుదల అయిన తరువాత దొంగతనాలు చేసేందుకు ముగ్గురు ప్రణాళికలు రచించినట్లు విచారణలో తేలింది.
– మంగళగిరి మండల పరిధిలోని యర్రబాలెంలో తాళం వేసిన ఇంటిని రాత్రి సమయంలో దొంగతనానికి పాల్పడ్డారు. ఆ ఇంట్లో బంగారం మాటీలు, చెవిదుద్దులు, 6 జతల పట్టీలతో పాటు రూ.20వేల నగదును దొంగిలించి పారిపోయారు. అదేవిధంగా దువ్వాడ, గాజువాక, అనకాపల్లి పోలీస్‌స్టేషన్ల పరిధిలో పలు దొంగతనాలకు పాల్పడినట్లు విచారణలో తేలింది. యర్రబాలెంలో జరిగిన దొంగతనంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన క్రమంలో సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా, ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ముగ్గురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి సుమారు 19 గ్రాముల బంగారం, 740 గ్రాముల వెండి స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ మురళీకృష్ణ వెల్లడించారు. ముగ్గురు నిందితులను కోర్టుకు హాజరుపర్చగా మంగళగిరి న్యాయస్థానం రిమాండ్ విధించినట్లు పేర్కొన్నారు. రూరల్ సీఐ ఎ.వి.బ్రహ్మం, రూరల్ ఎస్‌ఐలు సీహెచ్ వెంకటేశ్వర్లు, బాలు నాయక్, ఏఎస్‌ఐ రత్నరాజు, కానిస్టేబుల్ సాగర్ తదితరులు పాల్గొన్నారు.


