అక్రమాలకు అడ్డా సీసీఐ
పత్తి కొనుగోళ్లలో రూ.కోట్ల మేరకు మాయాజాలం
గతేడాది వ్యాపారులతో కుమ్మక్కు
40 వేల బేళ్ల పత్తి మాయం
సీఐడీ అధికారుల తనిఖీలు
పలు రికార్డులు స్వాధీనం
సీబీఐ కూడా విచారించే అవకాశం
పత్తి కొనుగోలు చేసి రైతులకు అండగా నిలవాల్సిన కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ).. వ్యాపారులతో కుమ్మకై ్క రూ.కోట్ల స్కాంలో ఇరుక్కు పోయినట్లు సమాచారం. దీనిపై సీఐడీ దృష్టి సారించింది. సోమవారం సీఐడీ అధికారులు సీసీఐ కార్యాలయానికి వెళ్లి రికార్డులు తనిఖీ చేశారు. పలు అంశాలకు సంబంధించిన ఫైళ్లను తమకివ్వాలని సూచించారు. ఇప్పటికే ప్రధానమంత్రి కార్యాలయానికి కూడా పలువురు ఫిర్యాదు చేయడంతో సీబీఐ కూడా రంగంలోకి దిగనున్నట్లు సమాచారం.
సాక్షి ప్రతినిధి, గుంటూరు సీసీఐలోని ప్రొక్యూర్‌మెంట్ అధికారులు జిన్నింగ్ మిల్లుల అధికారులతో కుమ్మక్కు అయినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. బాపట్ల, ఎన్టీఆర్, పల్నాడు జిల్లాలలోని బాపట్ల, జగ్గయ్యపేట, సత్తెనపల్లి, ఇబ్రహీంపట్నం కేంద్రాల్లో అక్రమాలు జరిగినట్లు ఫిర్యాదులు అందాయి. గత ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా సీసీఐ 19 లక్షల క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేసింది. వీటిని 3.75 లక్షల బేళ్లుగా మార్చారు. ఇందులో 40 వేల బేళ్లను బయ్యర్లు అక్రమంగా అమ్ముకున్నారని ఆరోపణలు వచ్చాయి.
నకిలీ రికార్డులు
ఎప్పుడూ లేని విధంగా గత ఏడాది నుంచి సీసీఐ కొనుగోలు కేంద్రాలను జిన్నింగ్ మిల్లులలో ఏర్పాటు చేస్తోంది. దీన్ని ఆసరాగా తీసుకుని రైతుల నుంచి కొనుగోళ్లు ప్రారంభం కాకముందే సీసీఐ నియమించిన జిన్నింగ్ మిల్లుల యజమానులు పత్తి బేళ్లను తరలించారు. జిన్నింగ్ మిల్లు యజమానులు తక్కువ ధరకే తక్కువ నాణ్యత గల తడి పత్తిని మధ్యవర్తుల ద్వారా కొనుగోలు చేసి దాన్ని రైతులు అమ్మిన పత్తిగా నకిలీ రికార్డులు తయారు చేశారు. సీసీఐ విధించిన ప్రమాణాల ప్రకారం నాసిరకం పత్తిని నాణ్యమైన పత్తిగా సీసీఐ అధికారులతో ధ్రువీకరించేలా వారితో కుమ్మక్కు అయ్యారు. సీసీఐ గోదాముల్లో నకిలీ, నాసిరకం పత్తిని నిల్వ చేయడం వల్ల నాణ్యత మరింత దెబ్బతిని కార్పొరేషన్‌కు భారీ నష్టం వాటిల్లింది. ఈ ప్రక్రియ వల్ల రైతులు నష్టపోగా మధ్యవర్తులు, మిల్లర్లకు లాభాల పంట పండింది.


