మారువేషంలో జీజీహెచ్‌లో తనిఖీలు
సీఎస్ ఆర్‌ఎంఓ ఎక్కడ?
రోగిగా రాత్రి సమయంలో చికిత్స కోసం వచ్చిన సూపరింటెండెంట్
వేషం మారిస్తే గుర్తించలేకపోయారు
● వైద్య సిబ్బంది పనితీరు పర్యవేక్షణ
●కొంత మేరకు లోపాలు గుర్తింపు
● సరిచేసుకోవాలంటూ హెచ్చరికలు
గుంటూరు మెడికల్: పేదల పెద్ద ఆసుపత్రి గుంటూరు జీజీహెచ్‌లో రాత్రిళ్లు వైద్య సేవలు సరిగా అందడం లేదనే ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి. రాత్రిళ్లు అధికారులు ఆసుపత్రిలో ఉండకపోవడంతో పేద రోగులకు సకాలంలో వైద్య సేవలందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పేద రోగులకు సేవలందేలా చూడాల్సిన ఆసుపత్రి సూపరింటెండెంట్ పట్టించుకోవడం లేదనే విషయంపై ‘సాక్షి’ లో ఈనెల 8న ‘చిక్కరు.. దొరకరు...!’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దీంతో సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణ మంగళవారం రాత్రి రోగి మాదిరిగా మారువేషంలో క్యాజువాల్టీకి వెళ్లారు.
సూపరింటెండెంట్ డాక్టర్ యశశ్వి రమణ రోగిలాగా వేషం మార్చి తలకు విగ్గుపెట్టుకుని, మాసిన చొక్కా ధరించి, మూతికి మాస్క్ ధరించి, చేతి కర్రతో క్యాజువాల్టీలోకి వెళ్లారు. ఆసుపత్రిలో పనిచేస్తున్న ఉద్యోగినికి సైతం గెటప్ వేయించి తన సహాయకురాలిగా వెంట తీసుకెళ్లారు. బయట పరిచయం ఉన్న ఓ వ్యక్తిని తన సహాయకుడిగా వెంట తీసుకెళ్లారు.
● క్యాజువాల్టీలో దగ్గుకుంటూ డ్యూటీలో ఉన్న వైద్యుల వద్దకు వెళ్లారు. తీవ్రంగా దగ్గుతుండటంతో ఒకింత అసహనానికి గురైన జూనియర్ వైద్యులు దగ్గేవారు వేరే గదిలోకి వెళ్లి చూపించుకోవాలని పంపించి వేశారు. వైద్యులు పరీక్షలు చేసి, ఈసీజీ, ఎక్స్‌రే, రక్త పరీక్షలు చేయించుకోవాలని చీటీ రాసి ఇచ్చారు.
● చీటీ తీసుకుని ఈసీజీ గదిలోకి వెళ్లగానే అక్కడ పనిచేస్తున్న ఉద్యోగి ఒకింత అసహనంతో ముందు ఎక్స్‌రే పరీక్ష చేయించుకుని రావాలని, తరువాత ఈసీజీ తీస్తానని వెల్లడించారు. దీంతో సూపరింటెండెంట్ ఏమీ మాట్లాడకుండా ఎక్స్‌రే తీయించుకుని మరలా ఈసీజీ గదికి వచ్చారు. ఈసీజీ టెక్నీషియన్ స్టూండెంట్‌తో పనిచేయిస్తూ తాను ఇతర వ్యాపకాల్లో ఉంటున్న విషయాన్ని గమనించారు.
● ఈసీజీ పరీక్ష అనంతరం మందులు తీసుకునేందుకు ఫార్మశీ గదికి వెళ్లగా చేతిలో మందులు పెట్టి వెళ్లిపోవాలని సూచించారు. మందులు కవర్‌లో పెట్టి ఇవ్వాలి కదా అని సూపరింటెండెంట్ ప్రశ్నించగా, ఫార్మాశిస్టులు కవర్లు మాకు సప్లయి లేవని, కవర్లు కావాలంటే వెళ్లి సూపరింటెండెంట్‌ను అడగాలని ఆయనకే కాస్తంత కఠువుగా సూచించారు.
● అనంతరం కాన్పుల విభాగానికి వెళ్లగా, అక్కడ పనిచేస్తున్న సెక్యూరిటీ సిబ్బంది, వైద్య సిబ్బంది లోపలికి రాకుండా అడ్డుకున్నారు. గర్భిణులు, మహిళలు లోపల ఉంటారని, లోపలకు అనుమతించమని చెప్పడంతో వెనుదిరిగారు.
● అనంతరం ఐసీయూలు, ఆర్థోపెడిక్, మెడిసిన్, సర్జరీ వార్డులు సూపరింటెండెంట్ తనిఖీ చేశారు. సుమారు 3 గంటలకు పైగా ఆసుపత్రిలో మారువేషంలో సూపరింటెండెంట్ తనిఖీ చేసిన విషయాన్ని ఒక్కరు కూడా గుర్తించకపోవడం గమనార్హం. కాగా సూపరింటెండెంట్ తనిఖీల్లో అందరూ విధుల్లో ఉండటం ఆశ్చర్యకరమైన విషయం.
ఆసుపత్రిలో సూపరింటెండెంట్ తరువాత సివిల్ సర్జన్ ఆర్‌ఎంఓ పోస్టు కీలకం. ఆసుపత్రిలోనే నివాసం ఉండి ముఖ్యంగా రాత్రిళ్లుఅందుబాటులో ఉండి, వైద్య సేవలు రోగులకు సకాలంలో అందేలా చూడాల్సిన బాధ్యత సీఎస్‌ఆర్‌ఎంఓదే. ఆసుపత్రిలో సీఎస్‌ఆర్‌ఎంఓగా డాక్టర్ బి.వెంకటేశ్వరరావు, డెప్యూటీ సివిల్ సర్జన్ ఆర్‌ఎంఓగా డాక్టర్ శ్రీనివాసరాజు, అసిస్టెంట్ ఆర్‌ఎంఓలుగా డాక్టర్ రమేష్, డాక్టర్ శ్రీదేవి ప్రియలు పనిచేస్తున్నారు. సూపరింటెండెంట్ తనిఖీలకు వచ్చిన సమయంలో నలుగురిలో ఒక్కరు కూడా విధుల్లో లేరు. అయినప్పటికీ ఆసుపత్రిలో అందరూ విధుల్లో ఉన్నారని సూపరింటెండెంట్ మీడియాకు తెలియజేయడం వాస్తవానికి దూరంగా ఉంది.


