రాజధానిలో నిర్మాణ కంపెనీ వాహనం ఢీకొని వృద్ధుడు మృతి
శాఖమూరు(తాడికొండ): రాజధాని ప్రాంతంలో నిర్మాణ కంపెనీకి చెందిన వాహనం ఢీ కొట్టడంతో ఓ వృద్ధుడు దుర్మరణం పాలైన ఘటన తుళ్ళూరు మండలం శాఖమూరు గ్రామంలో జరిగింది. వివరాల ప్రకారం.. ఓ నిర్మాణ కంపెనీకి చెందిన వ్యాను శాఖమూరు గ్రామం మీదుగా వెళుతూ అదుపుతప్పి రోడ్డు పక్కన కూర్చున్న కూకట్లపల్లి సుందరరావు (70) అనే వృద్ధుడిని బలంగా ఢీకొట్టి తొక్కించుకొని ముందుకు వెళ్లడంతో వృద్దుడు ఘటనా స్థలంలోనే ప్రాణాలొదిలాడు. స్థానికులు డ్రైవర్‌ను, డ్రైవర్ పక్కన కూర్చుని ఉన్న వ్యక్తిని పట్టుకొని దేహశుద్ధి చేశారు. డ్రైవర్ తన సీటు వదిలి గ్యాస్ వెల్డింగ్ చేసే నిర్మాణ కార్మికుడికి డ్రైవింగ్ ఇవ్వడంతోనే ఘటన జరిగిందని ఒప్పుకోవడంతో స్థానికులు తమదైన శైలిలో దేహశుద్ధి చేసి ఇచ్చి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని రోడ్డుపై బైఠాయించి డిమాండ్ చేశారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సర్ధిచెప్పేందుకు యత్నించినా ఫలితం లేకుండా పోయింది. నిర్మాణ కంపెనీకి చెందిన లారీలు, వాహనాలు అధిక వేగంతో రోడ్లపై తిరుగుతుండటంతో నిత్యం ప్రమాదాలకు కారణంగా మారుతుందని, గ్రామాల్లో ఇకపై వాహనాలు తిరగనివ్వమని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామాల్లో నుంచి సరుకు రవాణా చేయకుండా ప్రత్యామ్నాయ రహదారులు ఏర్పాటు చేసుకోవాలని పలువురు డిమాండ్ చేశారు. నిర్మాణ కంపెనీ ప్రతినిధులు ఎవరూ ఘటనా స్థలానికి చేరుకోకపోవడంతో ఆందోళన కొనసాగుతూనే ఉంది.
డ్రైవర్ సీటు వదిలి పక్కన ఉన్న వ్యక్తికి డ్రైవింగ్ ఇవ్వడంతో ఘటన


