స్కానింగ్‌లో దోపిడీ
తెనాలి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఇష్టారాజ్యం
ప్రైవేటు ఆసుపత్రుల రోగులకూ ఎంఆర్‌ఐ స్కానింగ్
రూ.3 నుంచి రూ.5 వేల వరకు వసూలు
ప్రైవేటు డాక్టర్లతో ఎంఆర్‌ఐ విభాగ ఉద్యోగుల కుమ్మక్కు
తల్లీపిల్లల ఆసుపత్రిలోనూ ప్రైవేటు ల్యాబ్ టెక్నీషియన్ దందా
రాత్రి వేళ అందుబాటులో ఉండని డ్యూటీ డాక్టర్లు
తెనాలి: పట్టణానికి చెందిన ఓ మహిళ నడుం నొప్పితో బాధపడుతోంది. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆర్థోపెడిక్ డాక్టర్‌ను సంప్రదించారు. వెన్నెముక సమస్య అని ఎంఆర్‌ఐ స్కానింగ్ రాశారు. ఆయన చెప్పినట్టే జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి ఎంఆర్‌ఐ తీయించారు. అక్కడి సిబ్బంది రూ.5 వేలు వసూలు చేశారు. అదేమంటే సిఫార్సు చేసిన డాక్టరుకు కమీషన్ ఇవ్వాలని చెప్పారు. ఇక రిపోర్టు సంగతేంటని అడిగితే అదికూడా డాక్టరుకు పంపుతామని అనటంతో తిరిగొచ్చారు. తెనాలిలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంఆర్‌ఐ విభాగంలో అవినీతి బాగోతానికి ఇదో నిదర్శనం. ప్రైవేటు వైద్యులతో కుమ్మక్కయి అక్కడ పనిచేసే టెక్నిషియన్, మరో ఉద్యోగి రోగులను దోచుకునే పనిలో పడ్డారు. ఎంఆర్‌ఐ స్కానింగ్‌కు ఒక్కో రోగి నుంచి రూ.3–5 వేలు వసూలు చేస్తున్నారు. ఆసుపత్రి డాక్టర్లు సిఫార్సు చేసిన కేసులకు ఉచితంగా స్కానింగ్ చేయాల్సి ఉంటే, ఇందుకు విరుద్ధంగా బయట రోగులకు స్కానింగ్ చేస్తూ ప్రైవేటు డాక్టర్లతో కలిసి వాటాలు పంచుకుంటున్నారు.
గర్భిణులను దోచుకుంటున్న ప్రైవేట్ ల్యాబ్ ప్రతినిధి...
మహిళలు గర్భం దాల్చిన నాటి నుంచి తల్లీపిల్లల వైద్యశాలకు వచ్చి గైనకాలజిస్ట్‌లకు చూపించుకుని వారి సూచన మేరకు మందులు వాడుతుంటారు. ఇక్కడ ప్రతిరోజూ సుమారు 200 మందికిపైగా వైద్య సేవలు పొందుతుంటారు. ఇక్కడే అల్ట్రా సౌండ్ స్కానింగ్ ఉంది. అలాగే జిల్లా ఆసుపత్రిలో అధునాతన ల్యాబ్‌ను ఏర్పాటు చేశారు. అయితే సమీపంలో ప్రైవేట్ ల్యాబ్‌ను నిర్వహిస్తున్న ఓ మహిళ కొందరు వైద్యుల సహకారంతో రక్త, మూత్ర పరీక్షలను తక్కువకు చేస్తామని చెబుతూ వసూలు చేస్తున్నారు. దీనిపై ఇంతకుముందు ‘సాక్షి’లో ప్రచురితం కావటంతో అధికారులు ఆమెను కట్టడి చేశారు. కొద్దినెలలు గడవగానే తిరిగి ఆమె ఇక్కడికి వచ్చి యథావిధిగా వసూలు చేస్తున్నారని రోగులు చెబుతున్నారు.
రాత్రి వేళ అందుబాటులో ఉండని వైద్యులు
తెనాలి జిల్లా ఆసుపత్రిలో నైట్ డ్యూటీ డాక్టర్లు విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా చూపుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. క్యాజువాలటీ విభాగంలో విధుల్లో ఉండాల్సిన వైద్యులు, తమ విశ్రాంతి గదులకే పరిమితం అవుతున్నారు. అక్కడికి వచ్చిన రోగులకు వెంటనే చికిత్స అందించటం లేదనే చెబుతున్నారు. మద్యం సేవించిన కారణంగా తీవ్ర కడుపునొప్పితో రాత్రి 9 గంటల వేళ ఆసుపత్రికి వచ్చిన ఒక రోగిని అప్పటి డ్యూటీ డాక్టరు నిర్దాక్షిణ్యంగా వైద్యం చేయనని పంపేశారు. ఉన్నతాధికారులు స్పందించాల్సిన ఆవశ్యకత ఉంది.


