ప్రతి గ్రామం స్వచ్ఛతకు నిలయం కావాలి
గుంటూరు వెస్ట్ : ప్రతి గ్రామం స్వచ్ఛతకు నిలయం కావాలని జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా అన్నారు. జిల్లా నీరు, పారిశుద్ధ్య కమిటీ సమావేశం సోమవారం స్థానిక కలెక్టరేట్‌లోని వీడియో సమావేశ మందిరంలో నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ పారిశుద్ధ్య నిర్వహణకు పెద్ద పీట వేయాలని, ఎక్కడా బహిరంగ మల విసర్జన లేకుండా చూడాలని అన్నారు. ఎక్కడైనా వ్యక్తిగత, సామూహిక మరుగుదొడ్లు అవసరం అనుకుంటే మంజూరుకు ప్రతిపాదనలు సమర్పించాలని ఆదేశించారు. తాగునీరు సరఫరాలో అత్యంత జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు.
పీఎంఏవై గృహాలు త్వరగా పూర్తి చేయాలి
ప్రధాన మంత్రి ఆవాస యోజన (పి.ఎం.ఏ.వై) గృహాల నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా పేర్కొన్నారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లోని వీడియో సమావేశ మందిరంలో హౌసింగ్, గ్రామ, వార్డు సచివాలయం, ఉపాధి హామీ పథకం, రీ సర్వే, రెవెన్యూ అంశాలు, ఏపీ సీఆర్డీఏ అంశాలపై సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పీఎంఏవై ద్వారా జిల్లాకు నిర్దేశించిన గృహాల నిర్మాణాలు పూర్తయ్యేలా మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలు, ప్రత్యేక అధికారులు నిరంతరం పర్యవేక్షించాలన్నారు. ప్రధానమంత్రి అవాస్ యోజన 2.0 పథకం ద్వారా ఇళ్లు నిర్మించుకోవటానికి ఆసక్తి ఉన్న వారి నుంచి దరఖాస్తులు స్వీకరించాలన్నారు.
మహిళలు ఆరోగ్యకర పోషణపై అవగాహన పెంచుకోవాలి ...
ఐటీసీ మిషన్ సునేహరకల్‌సౌజన్యంతో మహిళా, శిశు అభివృద్ధి శాఖ రూపొందించిన పోషణ అవగాహన పోస్టర్‌ను జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా రెవెన్యూ అధికారి ఎన్.ఎస్.కె.ఖాజా వలితో కలసి సోమవారం ఆవిష్కరించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్‌లోని వీడియో సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ సమతుల ఆహారం, ఐరన్, ఫోలిక్ యాసిడ్ వినియోగం, గర్భిణులు, పాలిచ్చే తల్లుల పోషణ, చిన్న పిల్లల ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు వంటి అంశాలపై అవగాహన పెంచడానికి పోస్టర్లను రూపొందించడం జరిగిందని చెప్పారు. పోషణలో ప్రతి కుటుంబం చైతన్యవంతం కావడం సమాజ ఆరోగ్యానికి కీలకమని అన్నారు. ఈ పోస్టర్లు గ్రామ స్థాయిలో అవగాహన కల్పించేందుకు ఉపయోగపడతాయని తెలిపారు.
రైతులు సీఎం యాప్‌లో నమోదు కావాలి....
రైతులు సీఎం యాప్‌లో నమోదు కావాలని జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లోని వీడియో సమావేశ మందిరంలో వ్యవసాయ మార్కెటింగ్ శాఖ రూపొందించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ద్వారా క్వింటాలుకు (పత్తి) రూ.8110 మద్దతు ధర ఉందన్నారు. పత్తి కొనుగోలుకు నోటిఫైడ్ చేసిన జిన్నింగ్ మిల్స్‌లో రైతులు విక్రయించవచ్చన్నారు. ఇందుకు రైతులు రైతు సేవా కేంద్రంలో వ్యవసాయ సహాయకులను సంప్రదించి సీఎం యాప్‌లో నమోదు చేసుకోవాలన్నారు. కపాస్ కిసాన్ యాప్ లో జిన్నింగ్ మిల్లు, విక్రయ తేదీ ఎంపిక చేసుకుని స్లాట్ బుక్ చేసుకోవాలని సూచించారు. మద్దతు ధర పొందవలసిన రైతులు నాణ్యత ప్రమాణాలు పాటించి తేమ శాతం 8 నుంచి 12 శాతం ఉండేట ట్లు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వివరించారు.
జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా


