శివనామస్మరణతో మార్మోగిన శివక్షేత్రం
పెదకాకాని: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పెదకాకాని శివాలయం సోమవారం శివనామస్మరణతో మార్మోగింది. ఆలయంలో తెల్లవారుజాము నుంచే భక్తుల రాక ప్రారంభమైంది. వేలాదిగా తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. పెదకాకాని శ్రీ భ్రమరాంబ మల్లేశ్వరస్వామి దేవస్థానంలో దశమి కార్తిక మాసం రెండో సోమవారం పురస్కరించుకుని కార్తిక దీపాలు వెలిగించి పూజలు చేసేందుకు పరిసర ప్రాంతాల నుంచే కాకుండా జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆలయానికి స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ జాయింట్ ఐజీ కొడాలి పుష్పలత దంపతులు విచ్చేసి పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలోని యజ్ఞాల బావి నీటితో స్నానాలు చేసి భక్తులు ఆలయం చుట్టూ శివనామం స్మరిస్తూ ప్రదక్షిణలు చేశారు. ఇంటి వద్ద నుంచి వెంట తెచ్చుకున్న పూజా సామగ్రితో కార్తిక దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు చేశారు. పొంగళ్లు పొంగించి స్వామివారికి నైవేద్యంగా సమర్పించారు. అనంతరం భ్రమరాంబ మల్లేశ్వరస్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు తర్వితగతిన స్వామి వారి దర్శనం జరిగేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. క్యూలైన్‌లలో ఉచితంగాపాలు, మజ్జిగ, తాగునీరు అందించారు. ప్రభలతో తరలివచ్చిన భక్తులు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయంలో అధికంగా అంత్రాలయ అభిషేకాలు, దర్శనాలు, ఏకవారాభిషేక పూజలు, రాహుకేతు పూజలు, అన్నప్రాసనలు, చెవిపోగులు కుట్టించడం, నామకరణలు, వాహనపూజలు, నవగ్రహ పూజలు జరిగాయి.
ఒక్క రోజే రూ.ఏడు లక్షల ఆదాయం
వివిధ సేవా కార్యక్రమాల ద్వారా స్వామివారికి సోమవారం ఒక్క రోజే రూ. 7 లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ డిప్యూటీ కమిషనర్ గోగినేని లీలాకుమార్ తెలిపా రు. కార్తిక పౌర్ణమి బుధవారం రోజుల భక్తుల రద్దీ దృష్ట్యా ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. ఆలయ ప్రాంగణంలో కోటి దీపోత్సవం, జ్వాలాతోరణం కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. భక్తులకు అసౌకర్యం కలుగకుండా పోలీసులు, వైద్య సిబ్బంది, అగ్నిమాపక సిబ్బంది, పంచాయతీ సిబ్బంది సహాయ సహకారాలు అందించినట్లు ఉప కమిషనర్ తెలిపారు.
శివనామస్మరణతో మార్మోగిన శివక్షేత్రం
శివనామస్మరణతో మార్మోగిన శివక్షేత్రం


