నకిలీ బంగారం అమ్మిన ముఠా గుట్టురట్టు
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): తవ్వకాల్లో దొరికిందని చెప్పి నకిలీ బంగారం అమ్మి, మోసం చేసిన కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఇద్దరిని అరండల్‌పేట పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.7 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు వెస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెస్ట్ డీఎస్పీ కె.అరవింద్ వివరాలు వెల్లడించారు. గుంటూరు కొరిటెపాడు ప్రాంతానికి చెందిన ఇద్దరు దంపతులకు సెప్టెంబర్ 15వ తేదీన కర్నాటక రాష్ట్రం బళ్లారి జిల్లా తిమ్మాలాపురం గ్రామం, విట్లాపురం పంచాయతీకి చెందిన ఐదుగురు ఒక బృందంగా ఏర్పడి ఒక రాంగ్ కాల్ చేసి తమ వద్ద తవ్వకాల్లో దొరికిన బంగారం ఉందని, దానిని తక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు బాధిత దంపతులను నమ్మించారు. బాధితులతో నెల రోజులపాటు మాట్లాడి వారిని కర్ణాటకకు రమ్మని చెప్పడంతో దంపతులు వెళ్లారు. వారికి చిన్న బంగారం ముక్క ఇచ్చి దానిని పరిశీలించుకున్న తరువాత మిగిలిన బంగారం అప్పగిస్తామని నమ్మించారు. అయితే చిన్న బంగారం ముక్క తీసుకుని పరిశీలించగా బంగారం అని తెలిసింది. అత్యాశకు పోయిన బాధిత దంపతులను బళ్లారికి పిలిపించుకుని వారి వద్ద నుంచి రూ.12 లక్షలు తీసుకుని బాధితులకు రాగి, జింగ్ మిశ్రంతో కూడిన అర కేజీ నకిలీ బంగారం ముక్కలను ఇచ్చారు. అక్కడ నుంచి తిరిగి గుంటూరుకు వచ్చిన బాధితులు అరకిలో బంగారం ముక్కలను పరీక్షంగా నకిలీ బంగారం అని తేలింది. అప్పటికే మోసం చేసిన ముఠా సెల్‌ఫోన్‌లను స్వీచ్ ఆఫ్ చేసి ఆచూకీ అందకుండా పోయారు.
బాధితులు అరండల్‌పేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు వెస్ట్ డీఎస్పీ కె.అరవింద్, సీఐ ఆరోగ్య రాజు, ఎస్‌ఐ సుబ్బారావు లతో కలిసి ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దర్యాప్తు ముమ్మరం చేశారు. పోలీసుల దర్యాప్తులో నకిలీ బంగారం విక్రయించే ముఠా గుంటూరుకు చెందిన మరొక దంపతులను కూడా మోసం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని వచ్చిన సమాచారం మేరకు ఆరా తీయడం ప్రారంభించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వారికి కూడా నకిలీ బంగారం ముక్కలను విక్రయించడానికి నల్లపాడు హౌసింగ్ బోర్డ్ వద్దకు నిందితుల ముఠాలోని ఇద్దరు వ్యక్తులు రాగా వారిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. అదుపులో తీసుకున్న ఇద్దరిని విచారించగా ఈ ముఠా సభ్యులు ఐదుగురు ఒకే ప్రాంతానికి చెందిన వారుగా దర్యాప్తులో తెలింది. నమ్మకంగా మోసం చేసి బాధితుల నుంచి వసూలు చేసిన నగదులో రూ.7 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాలో మిగిలిన ముగ్గురు వ్యక్తులు పరారీలో ఉన్నారని వారిని త్వరలో అరెస్ట్ చేస్తామని డీఎస్పీ తెలిపారు. నిందితులను అరెస్టు చేయడంలో ప్రతిభ కనబరిచిన అరండల్‌పేట సీఐ ఆరోగ్య రాజు, ఎస్‌ఐ ఎం.సుబ్బారావు, కానిస్టేబుల్ డేవిడ్, ఉమామహేశ్వరరావులను డీఎస్పీ అభినందించారు.
కర్నాటకకు చెందిన ఇద్దరి అరెస్ట్
రూ.7 లక్షలు స్వాధీనం చేసుకున్న
పోలీసులు
మిగిలిన వారి కోసం గాలింపు
వివరాలు వెల్లడించిన
గుంటూరు వెస్ట్ డీఎస్పీ అరవింద్


