ఉద్యోగుల హక్కులను కాలరాస్తున్న 60, 61 జీఓలను సవరించాలి
గుంటూరు ఎడ్యుకేషన్: ఉద్యోగుల హక్కులను కాలరాసే విధంగా ఉన్న 60, 61 జీవోలను సవరించాలని ఏఐఎస్టీఎఫ్ ఆర్థిక కార్యదర్శి సీహెచ్ జోసఫ్ సుధీర్‌బాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం కంకరగుంటలోని ఎస్టీయూ భవన్‌లో జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో సుధీర్‌బాబు మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాలతో మంత్రివర్గ సబ్ కమిటీతోపాటు సీఎం స్థాయిలో పలు విడతలుగా చర్చించిన తరువాత ఈనెల 20న విడుదల చేసిన 60, 61 జీవోల్లో అసంబద్ధ్దంగా ఉన్న అంశాలను సవరించాలన్నారు. సీఎం చంద్రబాబుతో చర్చల తర్వాత ఉద్యోగులకు దీపావళి కానుకగా డీఏ వస్తుందని ఉద్యోగులు ఆశపడ్డారని, డీఏ బకాయిలను ఉద్యోగ విరమణ తరువాత చెల్లిస్తామని ఆర్థిక శాఖ పేర్కొనడం ఉద్యోగులను మోసగించడమేనని అన్నారు. సీపీఎస్‌పై కనీస సమాచారం లేదని, పెన్షనర్లకు డీఏ బకాయిల చెల్లింపులు 2027–28 ఆర్థిక సంవత్సరం నుంచి 12 దఫాల్లో విడుదల చేస్తామని జీవోలో పేర్కొనటం, ప్రపంచ బ్యాంకు షరతులకు తలొగ్గి ఉద్యోగుల, పెన్షనర్ల హక్కులను కాలరాయటమేనని అన్నారు. తక్షణమే జీవోలను సవరించి ఉద్యోగులకు డీఏ బకాయిలను పీఎఫ్ ఖాతాకు జమచేసి, సీపీఎస్ వారికి 90 శాతం నగదును, పెన్షనర్స్‌కు రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించేలా సవరించిన ఉత్తర్వులు వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేని పక్షంలో కలిసి వచ్చే సంఘాలతో కార్యాచరణ రూపొందించి నిరసనలు చేపడతామని స్పష్టం చేశారు. సమావేశంలో ఎస్టీయూ గుంటూరు జిల్లా అధ్యక్షుడు డి.పెదబాబు, ప్రధాన కార్యదర్శి డీకే సుబ్బారెడ్డి, సీనియర్ నాయకులు షేక్ బాజీ, వై.శ్యాంబాబు, జి.జోజప్ప, పి.దిబ్బయ్య, షేక్ ఖాజావలి తదితరులు పాల్గొన్నారు.
ఏఐఎస్టీఎఫ్ ఆర్థిక కార్యదర్శి
జోసఫ్ సుధీర్‌బాబు


