
ఇవీ వ్యాధి లక్షణాలు...
నేడు ‘వరల్డ్ ఆస్టియోపొరోసిస్ డే ’ పట్టుకుంటేనే ఎముకలు విరిగిపోయే వ్యాధిపై అవగాహన ముఖ్యం ఎండ తగలకపోవటమే ప్రధాన లోపం యువతలోనూ నానాటికీ పెరుగుతున్న ఎముకల సమస్యలు
గుంటూరు మెడికల్: గుంటూరు బ్రాడీపేటకు చెందిన జి.రామోహన్‌రావు హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు. విధుల్లో భాగంగా నిత్యం ఏసీ గదుల్లో కూర్చుంటారు. ఇటీవల దసరా సెలవులకు సొంత ఊరు వచ్చి ద్విచక్ర వాహనంపై షాపునకు వెళ్తున్న సమయంలో ప్రమాదానికి గురయ్యారు. పాతికేళ్లకే చిన్న ప్రమాదానికి ఎముక విరగడంతో వైద్యులు ఆశ్చర్యపోయారు. పరీక్షలు చేసి ఎండ తగలకుండా ఏసీ గదుల్లో ఆధునిక జీవనశైలి వల్ల ఆస్టియోపొరోసిస్‌కు గురైనట్లు నిర్ధారించారు. ఈ వ్యాధిపై అవగాహన కల్పించేందుకు ఇంటర్నేషనల్ ఆస్టియోపొరోసిస్ ఫౌండేషన్ (ఐఓఎఫ్) 1996 నుంచి ప్రతి ఏటా అక్టోబర్ 20న వరల్డ్ ఆస్టియో పొరోసిస్ డేను నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ‘సాక్షి’ అందిస్తున్న ప్రత్యేక కథనం.
ఎండ తగలక ఇబ్బందులు
చిన్న చిన్న దెబ్బలకే ఎముకలు విరిగిపోవటం ఆస్టియోపొరోసిస్ వ్యాధి (బోలు ఎముకల వ్యాధి) సోకినవారిలో కనిపించే ప్రధాన లక్షణం. ఆధునిక జీవనశైలి వల్ల నేడు యువతలో కూడా ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తూ ఉండటంపై వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కళాశాల, పాఠశాలల పిల్లల్లో చాలా మంది ఎండ ఏ మాత్రం తగలకుండా ఏసీ గదుల్లో ఉంటున్నారు. వీరు ఆటలు ఆడేందుకు కూడా ఎండలోకి వెళ్లకపోవటంతో దెబ్బ తగిలిన సమయంలో ఎముకలు విరిపోతున్నాయి.
బాధితులు అధికమే...
సాధారణంగా ఆడవారిలో మోనోపాజ్ దశ దాటిన తరువాత 40 ఏళ్ల వయసులో, మగవారిలో 50 ఏళ్ల వయస్సు వారిలో ఈ వ్యాధి కనిపిస్తుంది. ఆధునిక జీవనశైలి వల్ల నేడు 20 శాతం మంది యువత వ్యాధి బారిన పడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా వయోవృద్ధుల్లో 33 శాతం మంది తుంటి విరిగి పోవడం వంటి సమస్యలతో బాధపడుతున్నారు. వారిలో ప్రతి ఐదుగురిలో ఒకరు ఇలా పడి మరణిస్తున్నారు. ఆడవారిలో 50 ఏళ్లు దాటిన ప్రతి ముగ్గురిలో ఒకరు, మగవారిలో 12 మందిలో ఒకరు ఈ వ్యాధితో బాధపడుతున్నారు. జిల్లాలో 200 మంది ఆర్థోపెడిక్ వైద్య నిపుణులు ఉన్నారు. రోజూ ఒక్కో వైద్యుడి వద్దకు ఓపీ వైద్య విభాగానికి 50 మందికి పైగా వివిధ రకాల ఎముకల సమస్యలతో వస్తున్నారు. వీరిలో 15 మంది ఆస్టియోపొరోసిస్ బాధితులే ఉంటున్నారని వైద్య నిపుణులు చెప్పారు. గుంటూరు జీజీహెచ్‌లో కూడా రోజూ వివిధ రకాల ఆర్థోపెడిక్ సమస్యలతో 200 మంది వరకు చికిత్స కోసం వస్తున్నారు. వీరిలో 40 మంది ఈ వ్యాధి బాధితులే ఉన్నట్లు పరీక్షల అనంతరం వైద్యులు నిర్ధారిస్తున్నారు.
కారణాలు ఇవీ ...
కుటుంబంలో ఎవరికై నా ఒకరికి వ్యాధి ఉంటే వారసత్వంగా ఇతరులకు వచ్చే అవకాశం ఉంది. సరైన పోషకాహారం తీసుకోకపోవటం, మద్యపానం, ధూమపానం వంటి చెడు అలవాట్లు, థైరాయిడ్, లివర్ వ్యాధుల వల్ల, కొన్ని రకాల మందులు వాడటం వల్ల ఈ వ్యాధి సోకుతుంది. రోజంతా ఏమాత్రం ఎండలోనికి రాకుండా ఏసీలోనే గంటల తరబడి గడపటం వల్ల ఈ వ్యాధి వస్తుంది. శారీరక వ్యాయామం ఏమాత్రం చేయనివారికి, ముఖ్యంగా రోజూ కనీసం అరగంట కూడా నడవకపోవటం వల్ల ఇది సోకుతుంది. రక్తపరీక్షల ద్వారా, ఎక్స్‌రే ద్వారా, ఎముకల సాంద్రత పరీక్షల ద్వారా వ్యాధి నిర్ధారణ చేయొచ్చు.
వయస్సుపైబడిన వారిలో నడుమునొప్పి, వెన్నెముక ఎదుగుదల లోపించి ఎత్తు ఆగిపోవటం, ఒంటి నొప్పులు, ఎలాంటి పనులు చేయలేక పోవటం, నీరసం,నిరాశ, ఓపిక లేకపోవటం తదితర లక్షణాలు ప్రాథమిక దశలో కనిపిస్తాయి. ఎండ నుంచి శరీరానికి లభించే డి–విటమిన్ దొరక్కపోవడం కూడా వ్యాధికి ఒక కారణం. లక్షణాలు కనిపించిన వెంటనే ఆర్థోపెడిక్ వైద్యుడిని సంప్రదించాలి. అశ్రద్ధ చేస్తే వెన్నెముక, చేతి మణికట్టు, తుంటి వద్ద ఏ మాత్రం చిన్న దెబ్బ తగిలినా.. చివరికి ఇంటి గడప కాలికి తగిలినా ఎముకలు విరిగిపోతాయి.

ఇవీ వ్యాధి లక్షణాలు...