
కార్తిక పూజలకు శివాలయం ముస్తాబు
పెదకాకాని: దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న భ్రమరాంబ మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో కార్తిక మాసానికి సంబంధించి ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు ఆలయ అధికారి, ఉప కమిషనర్ గోగినేని లీలా కుమార్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. కార్తికమాస ఏర్పాట్లపై ఆదివారం డీసీ మాట్లాడుతూ కార్తిక మాసం సందర్భంగా ఈనెల 22 నుంచి నవంబరు 20 వ తేదీ వరకు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు. లోక కల్యాణార్థం నెలరోజులపాటు ఉదయం మహాన్యాస పూర్వక రుద్ర జప, రుద్రహోమం, ఏకాదశ రుద్రాభిషేక పూజలు నిర్వహించనున్నామని తెలిపారు. సాయంత్రం 4.30 నుంచి 7 గంటల వరకు అష్టోత్తర పూజ జరుగుతుందన్నారు. నెల రోజులపాటు నిత్య పరోక్ష అభిషేక పథకాన్ని కూడా ప్రవేశపెట్టినట్లు చెప్పారు. రూ.వెయ్యి చెల్లించి ఈ పథకంలో పాల్గొనే భక్తులకు కార్తికమాసం అనంతరం స్వామివారి ప్రసాదం వారి చిరునామాకు పోస్టు ద్వారా పంపిస్తామని తెలిపారు. ఈ పథకంలో చేరిన భక్తులను కార్తిక మాసంలో ఆది, సోమవారాలు, పౌర్ణమి రోజులు మినహా ఇతర రోజుల్లో ప్రత్యేక క్యూలైన్ల ద్వారా స్వామి వారి దర్శనానికి అనుమతిస్తామని తెలిపారు. భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక క్యూలైన్‌లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వారికి ఎలాంటి ఇబ్బంది కూడా కలగకుండా త్వరగా దర్శనం అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా శాంతిభద్రతల నిమిత్తం పోలీసు, అగ్నిమాపక, పంచాయతీరాజ్, ఆరోగ్య శాఖల సిబ్బంది సేవలు వినియోగించుకుంటామని చెప్పారు. కార్తిక మాసం పర్వదినమైన పౌర్ణమి రోజున కోటి దీపోత్సవ కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు.