
పత్తిలో పూత రాలడాన్ని నివారించాలి
కేంద్రీయ సస్య రక్షణ కేంద్రం ప్లాంట్ ప్రొటెక్షన్ అధికారి కె. వీరయ్య చౌదరి
ప్రత్తిపాడు: పత్తిలో పూత రాలడాన్ని నివారించే దిశగా రైతులు చర్యలు తీసుకోవాలని కేంద్రీయ సస్య రక్షణ కేంద్రం ప్లాంట్ ప్రొటెక్షన్ అధికారి కె. వీరయ్య చౌదరి సూచించారు. మండల పరిధిలోని పెదగొట్టిపాడులో గురువారం ఓ పత్తి పొలంలో పొలంబడి నిర్వహించారు. స్థానిక మండల వ్యవసాయాధికారి షేక్ సుగుణా బేగంతో కలిసి వీరయ్య చౌదరి పత్తి పంటను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన అధిక తేమ కారణంగా పత్తిలో పూత రాలడంతో పాటు పలు తెగుళ్లు, పురుగులను గమనించారు. నివారణకు తీసుకోవలసిన చర్యలను రైతులకు వివరించారు. పూత రాలడాన్ని నివారించేందుకు ఎకరానికి కేజీ 19–19–19 లేదా 13–0–45 పిచికారీ చేయాలని సూచించారు. పంటలో అక్కడక్కడా పచ్చ దోమ కూడా ఉందని, నివారణకు ఫిప్రోనిల్ 2 ఎం.ఎల్. లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.4 ఎం.ఎల్. లేదా ఎసిటామిప్రిడ్ 0.2 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలని తెలిపారు. అల్లిక రెక్కల పురుగు వంటి మిత్ర పురుగులను కూడా అధికంగా గమనించామని, ప్రస్తుత పరిస్థితుల్లో పురుగు మందులను ఎక్కువగా వాడనవసరం లేదని సూచించారు. అధిక వర్షాలకు సోకుతున్న ఆకుమచ్చ తెగులు నివారణకు ఒక గ్రాము స్టెప్టోసైక్లిన్, కాపర్ ఆక్సి క్లోరైడ్ 30 గ్రాములు పది లీటర్ల నీటికి కలిపి రెండు లేదా మూడుసార్లు పిచికారీ చేసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో వీహెచ్‌ఏ షణ్ముఖ్, రైతులు పాల్గొన్నారు.