జాతీయ రహదారిపై ప్రమాదం | - | Sakshi
Sakshi News home page

జాతీయ రహదారిపై ప్రమాదం

Oct 13 2025 7:32 AM | Updated on Oct 13 2025 7:32 AM

జాతీయ

జాతీయ రహదారిపై ప్రమాదం

జాతీయ రహదారిపై ప్రమాదం సుపరిపాలనకు స.హ.చట్టం ఆయుధం 15న విద్యుత్‌ కాంట్రాక్ట్‌ ఉద్యోగుల నిరవధిక సమ్మె

గుర్తు తెలియని బస్సు ఢీకొని ఇద్దరు నేపాల్‌ యువకులు మృతి

మంగళగిరి టౌన్‌: మంగళగిరిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నేపాల్‌ దేశానికి చెందిన ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. సేకరించిన వివరాల మేరకు గుంటూరు జిల్లా పెదకాకాని సమీపంలో వున్న ఓ బార్‌లో సుమారు సంవత్సరం నుంచి నేపాల్‌కు చెందిన మనోజ్‌ బిస్తా (26), రాకేష్‌ (34)లు పనిచేస్తున్నారు. భ్రమరాంబపురం కాలనీలో ఓ రూమ్‌ అద్దెకు తీసుకుని ఇద్దరూ ఉంటూ ప్రతిరోజూ విధులకు వెళ్లివస్తుంటారు. ఈ క్రమంలో శనివారం అర్ధరాత్రి 12 గంటలకు విధులను ముగించుకుని యజమాని దగ్గర నుంచి స్కూటీ తీసుకుని వెళ్లారు. తిరిగి వెళ్లే క్రమంలో ఆదివారం తెల్లవారుజామున 4:30 సమయంలో జాతీయ రహదారిపై విజయవాడ వైపు వెళుతుండగా మంగళగిరి వద్ద వెనుక నుంచి ఓ వాహనం ఢీకొట్టింది. దీంతో ఇద్దరు యువకులు రోడ్డుమధ్యలో పడిపోయారు. అదేసమయంలో వెనుక నుంచి ఓ గుర్తుతెలియని బస్సు వారిపై నుంచి వెళ్లడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. సమీపంలో వున్న ఓ వ్యక్తి చూసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఘటనా స్థలానికి చేరుకున్న మంగళగిరి పట్టణ ఎస్‌ఐ రవీంద్రనాయక్‌ మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం మంగళగిరి ఎయిమ్స్‌కు తరలించి మృతుల వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతుల్లో మనోజ్‌ బిస్తా (26) యువకుడికి తల్లిదండ్రులు లేరని, 10 సంవత్సరాల నుంచి గుంటూరు నగరంలో వివిధ బార్లలో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడని ప్రాథమిక విచారణలో తేలినట్లు పోలీసులు తెలిపారు. నేపాల్‌లోని సౌరన ప్రస్తకీర్‌ ప్రాంతానికి చెందిన ఇద్దరు యువకుల్లో రాకేష్‌ (34)కు తండ్రి లేడని, అమ్మ, చెల్లి మాత్రమే ఉన్నారని, ఇతను గత సంవత్సర కాలం నుంచి బార్‌లో పనిచేస్తున్నాడని ఇద్దరూ రూమ్‌లో అద్దెకు ఉంటూ పెదకాకాని గోల్డెన్‌ బార్‌లో పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రాకేష్‌ కుటుంబ సభ్యులకు సమాచారం అందించామని పేర్కొన్నారు.

గుంటూరు ఎడ్యుకేషన్‌: ప్రభుత్వ పాలనలో పారద ర్శకత, జవాబుదారీతనం కోసం సమాచార హక్కు చట్టం ఒక ఆయుధం వంటిదని రాష్ట్ర సమాచార కమిషనర్‌ పి.శామ్యూల్‌ జోనాథాన్‌ పేర్కొన్నారు. ఆదివారం బ్రాడీపేటలోని యూటీఎఫ్‌ హాలులో ఫోరమ్‌ ఫర్‌ ఆర్‌టీఐ ఆధ్వర్యంలో సమాచార హక్కుచట్టం అమల్లోకి వచ్చి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చైతన్య సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న శామ్యూల్‌ జోనాథాన్‌ మాట్లాడుతూ సమాచారం పొందడం ప్రజల ప్రాథమిక హక్కు అని, ప్రభుత్వ కార్యకలాపాలకు సంబంధించిన సమాచారాన్ని పొందవచ్చునని తెలిపారు. అవగాహన సంస్థ కార్యదర్శి కొండా శివరామిరెడ్డి మాట్లాడుతూ సమాచారహక్కు చట్టం సక్రమంగా అమలు కావడం లేదన్నారు. చట్టాన్ని ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందన్నారు. సదస్సులో దళిత బహుజన ఫ్రంట్‌ జాతీయ అధ్యక్షుడు కొరివి వినయ్‌కుమార్‌, ఫోరం ఫర్‌ ఆర్‌టీఐ అధ్యక్షుడు ఈమని హనుమంతరావు, కార్యదర్శి మద్దెల విజయకుమార్‌, డాక్టర్‌ ఎం.సుధ, కె.జయసుధ, విల్సన్‌ పాల్గొన్నారు.

లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్‌): విద్యుత్‌ కార్మిక వర్గ శ్రేయస్సు కోసం, సంస్థ పరిరక్షణకై కాంట్రాక్ట్‌ కార్మికులు, ఉద్యోగుల సమస్యలు పరిష్కారం అయ్యేవరకు పోరాటం కొనసాగిస్తామని యునైటెడ్‌ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్‌ యూనియన్‌ కమిటీ అధ్యక్ష, కార్యదర్శులు, స్ట్రగుల్‌ కమిటీ డిస్కం నాయకులు డి.వెంకటేశ్వరరావు, ఎల్‌.రాజులు ఆదివారం తెలిపారు. విద్యుత్‌ కాంట్రాక్ట్‌ అండ్‌ ఔట్‌సోర్సింగ్‌ కార్మికుల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలన్నారు. దీనిలో భాగంగా ఈనెల 15న విద్యుత్‌ కాంట్రాక్ట్‌, జేఎల్‌ఎం, గ్రేడ్‌ 2 ఉద్యోగులు నిరవధిక సమ్మె చేయనున్నారని, జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం మహారాష్ట్రలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాడుతున్న కార్మికులకు సంఘీభావం తెలిపారు.

జాతీయ రహదారిపై ప్రమాదం 1
1/2

జాతీయ రహదారిపై ప్రమాదం

జాతీయ రహదారిపై ప్రమాదం 2
2/2

జాతీయ రహదారిపై ప్రమాదం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement