
వైఎస్సార్‌సీపీకి చెందిన వారమనే నీరివ్వడం లేదు!
తుళ్ళూరు మండలం వడ్డమాను ఎస్సీ కాలనీలో 10 రోజులుగా నరకయాతన ఉన్నతాధికారులైనా పట్టించుకుని నీరు సరఫరా చేయించాలని స్థానికుల వినతి
వడ్డమాను(తాడికొండ): వైఎస్సార్‌సీపీకి అనుకూలంగా ఉంటామనే నెపంతో గత 10 రోజులుగా తమ బజారుకు నీరు ఇవ్వకుండా అధికారులు స్థానిక నాయకులతో కుమ్మకై ్క వేధిస్తున్నారని తుళ్ళూరు మండలం వడ్డమాను గ్రామ ఎస్సీ కాలనీ వాసులు ఆరోపించారు. గ్రామంలో మొత్తం 7 మోటార్లు ఉన్నాయి. వాటిలో తమ బజారుకు వచ్చే మోటారు మాత్రమే మరమ్మతులకు గురైందనే నెపంతో నీరివ్వడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. గోడు చెప్పుకుందామని కార్యదర్శితోపాటు ఎవరిని ఆశ్రయించినా సమస్య పరిష్కారం కావడం లేదన్నారు. పైగా హేళనగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవేళ నిజంగా సమస్యే ఉంటే మరమ్మతులకు 10 రోజులు ఎందుకు పడుతుందని ప్రశ్నించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు అయినా చేసి కనీసం ట్యాంకర్ల ద్వారా రెండు రోజులకు ఒకసారి సరఫరా చేయాలని కోరారు. దీనిపై కార్యదర్శి శ్రీనివాసరావును వివరణ కోరగా మోటారు మరమ్మతులకు గురైన మాట వాస్తవమేనని చెప్పారు. గత 4 రోజులుగా తనకు ఇతర పనులు ఉండటం వలన సమయం కుదరలేదని తెలిపారు. పార్టీ, కుల వివక్ష వంటివి తాను చూపించలేదన్నారు. త్వరలో మోటారుకు మరమ్మతులు చేయించి నీటిని అందించేందుకు ప్రయత్నిస్తానని తెలిపారు.