
ఫార్మసీ ప్రవేశాలకు కొత్త షెడ్యూల్
గుంటూరు ఎడ్యుకేషన్: ఏపీ ఈఏపీసెట్–2025లో అర్హత సాధించి, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థుల కోసం రాష్ట్ర ఉన్నత విద్యామండలి, సాంకేతిక విద్యాశాఖ సంయుక్తంగా సవరించిన షెడ్యూల్ విడుదల చేశాయి. ఉమ్మడి గుంటూరుజిల్లాలో 43 ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశాల కోసం ఎదురు చూస్తున్న విద్యార్థులు ఈనెల 14 వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంది. రిజిస్ట్రేషన్ పూర్తయిన విద్యార్థులు కళాశాలలను ఎంపిక చేసుకునేందుకు ఈనెల 14 నుంచి 17వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో ఆప్షన్లు నమోదు చేసుకోవాల్సి ఉంది.
దరఖాస్తు సమయంలోనే
పూర్తయిన సర్టిఫికెట్ల పరిశీలన..
ఏపీ ఈఏపీ సెట్‌లో ర్యాంకులు సాధించిన విద్యార్థులు హెల్ప్‌లైన్ కేంద్రాలకు విధిగా వెళ్లాల్సిన అవసరం లేదు. దరఖాస్తు సమయంలోనే విద్యార్థులు సమర్పించిన టెన్త్, ఇంటర్ మార్కుల జాబితాలు, సామాజికవర్గ, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాల పరిశీలన ఆన్‌లైన్‌లో పూర్తి చేశారు. ధ్రువపత్రాల పరిశీలన అసంపూర్తిగా ఉన్న విద్యార్థులు వాటిని కంప్యూటర్ స్క్రీన్‌పై కనిపించే సూచనల ఆధారంగా తిరిగి, ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అనంతరం విద్యార్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చు. గుంటూరు శివారు నల్లపాడులోని ఎంబీటీఎస్ ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో హెల్ప్‌లైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
25 నుంచి తుది విడత కౌన్సెలింగ్
బైపీసీ స్ట్రీమ్ మొదటి విడత ప్రవేశాల ప్రక్రియ ముగిసిన వెంటనే కళాశాలల్లో మిగులు సీట్ల భర్తీ కోసం ఈనెల 25 నుంచి తుది విడత ప్రవేశాల ప్రక్రియ చేపట్టనున్నారు. ఏపీ ఈఏపీసెట్ బైపీసీ స్ట్రీమ్ నోటిఫికేషన్‌లోనే రెండు విడతలకు సంబంధించిన షెడ్యూల్ వివరాలను పొందుపర్చారు.