
గుంటూరు నగర వాసులకు తప్పని తీవ్ర ఇబ్బందులు
జలమయమైన ప్రధాన రహదారులు కార్పొరేషన్ కార్యాలయంలోకి మురుగునీరు పొంగిపొర్లిన డ్రైనేజీ కాలువలు పలుచోట్ల నివాసాలలోకి చేరిన వాననీరు ప్రధాన కూడళ్లలో భారీగా స్తంభించిన ట్రాఫిక్ రైల్వే గేట్ల వద్ద వాహనదారులకు చుక్కలు తీవ్ర ఇబ్బందులు పడిన నగరవాసులు
స్తంభించిన జన జీవనం
నెహ్రూనగర్: గుంటూరు నగరంలో శనివారం మధ్యాహ్నం 1.30 గంటలకు కురిసిన భారీ వర్షానికి జనజీవనం అస్తవ్యస్తం అయింది. రహదారులు జలమయం అయ్యాయి. డ్రైనేజీలు పొంగిపొర్లాయి. వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లోని మూడు వంతెనలు, కంకరగుంట అండర్ పాస్, ఆర్టీసీ బస్టాండ్, కొత్తపేట, ఓల్డ్‌క్లబ్ రోడ్డు, పట్టాభిపురం, విద్యానగర్, పాతగుంటూరు, లాలాపేట, ప్రగతినగర్, నందివెలుగు రోడ్డు, ఏటీ అగ్రహారం, బీఆర్ స్టేడియం వద్ద, హుస్సేన్ నగర్, చంద్రబాబునాయుడు కాలనీ, చుట్టుగుంట, కేవీపీ కాలనీ, నెహ్రూనగర్, మల్లికార్జునపేట, రాజీవ్‌గాంధీనగర్ కాకాని రోడ్డులోని పలు ప్రాంతాలో వాననీరు పోటెత్తింది.
కార్పొరేషన్ కార్యాలయంలోకి మురుగునీరు
నగర ప్రజలను వర్షం కష్టాల నుంచి కాపాడే సంగతి దేవుడెరుగు... ఏకంగా గుంటూరు కార్పొరేషన్ కార్యాలయంలోకే వర్షపు నీరు చేరింది. మోటార్ల సాయంతో వాటిని సిబ్బంది బెయిల్ అవుట్ చేయించాల్సిన దుస్థితి నెలకొంది. రైతు బజార్లు, కూరగాయాల మార్కెట్లలోకి వర్షపు నీరు చేరడంతో వ్యాపారులు, కొనుగోలుదారులు తీవ్ర అవస్థలు పడ్డారు. డ్రైనేజీలు పొంగి పొర్లడంతో వ్యర్థాలన్నీ రోడ్లపైకి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
రైల్వేగేటు వద్ద వేల సంఖ్యలో వాహనాలు
మూడు వంతెనల వద్ద నీటి ఉధృతి ఎక్కువగా ఉండటంతో అరండల్‌పేట, అమరావతి రోడ్డు వైపునకు వెళ్లే వాహనాలన్నీ కొత్తపేట, నెహ్రూనగర్ రైల్వే గేటు, సంజీవయ్యనగర్ రైల్వే గేటు మీదుగా మళ్లాయి. అరండల్‌పేట, అమరావతిరోడ్డు వెళ్లేందుకు వేల సంఖ్యలో సంజీవయ్యనగర్ గేటు వద్దకు చేరుకున్నాయి. ఇక్కడ 5 నిమిషాలకొకసారి గేటు వేశారు. దీంతో ట్రాఫిక్ పెద్ద ఎత్తున నిలిచిపోయింది. వర్షంలోనే నిలబడి గేటు దాటేందుకు నానా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. మరో పక్క ఈ రహదారి వెంటే అంబులెన్స్‌లు రావడం, రైల్వే గేటు పడటంతో చాలా సేపు ట్రాఫిక్‌లోనే అవి చిక్కుకుపోయాయి. గేటు తీసిన వెంటనే అక్కడి స్థానికులు అప్రమత్తమై అంబులెన్స్‌లు వెళ్లేందుకు సహకరించారు.
శనివారం కురిసిన భారీ వర్షానికి జనజీవనం స్తంభించిపోయింది. అత్యవసర పనుల నిమిత్తం బయటకు వచ్చిన వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. శంకర్ విలాస్ వద్ద కొత్త బ్రిడ్జి పనులతో ట్రాఫిక్ అంతా సంజీవయ్యనగర్ రైల్వేగేటు, కొత్తపేట, అరండల్‌పేట, కంకరగుంట ఫ్లయ్ ఓవర్ మీద ప్రభావం చూపింది. నగర వాసులు వర్షంలోనే ట్రాఫిక్‌లో ఇరుక్కుపోవాల్సిన పరిస్థితి నెలకొంది. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లల్లోకి వరద నీరు చేరడంతో స్థానికులు తోడి బయటకు పోసుకోవాల్సిన వచ్చింది. సాయంత్రం వరకు ఆగకుండా వర్షం కురిసింది. ఉద్యోగులు, విద్యార్థులు, చిరు వ్యాపారులు అవస్థలు పడక తప్పలేదు.

గుంటూరు నగర వాసులకు తప్పని తీవ్ర ఇబ్బందులు