
నిన్న తురకపాలెం.. నేడు కొత్తరెడ్డిపాలెం
జ్వరంతో ఆశా వర్కర్ మృత్యువాత మొద్దునిద్ర వదలని ఆరోగ్య శాఖ పలుచోట్ల ప్రబలుతున్న విష జ్వరాలు పట్టించుకోని పంచాయతీరాజ్ విభాగం ఎక్కడ చూసినా అధ్వానంగా పారిశుద్ధ్యం ఐదుగురికి స్టెఫెలో కొకై బ్యాక్టీరియా పాజిటివ్ తీవ్ర ఆందోళన చెందుతున్న స్థానికులు
సాక్షి ప్రతినిధి, గుంటూరు, చేబ్రోలు: తురకపాలెం ఘటనతో కూడా గుంటూరు జిల్లా యంత్రాంగం మొద్దునిద్ర వీడటం లేదు. తురకపాలెంలో మెలియోడోసిస్ వ్యాధితో రెండు నెలల్లోనే పెద్ద సంఖ్యలో ప్రజలు మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా గుంటూరు జిల్లా చేబ్రోలు గ్రామ శివారు కొత్తరెడ్డిపాలెంలో ఇవే పరిస్థితులు నెలకొన్నాయి. గ్రామస్తులు దీనిపై ఆందోళన చెందుతున్నారు. రెండు రోజుల క్రితం ఆశా వర్కర్ సుమలత జ్వరంతో బాధపడుతూ నాలుగు రోజులు పాటు చికిత్స పొందారు. శుక్రవారం ఆమె మరణించటం కలకలం రేగింది. జ్వరం ఇతర అనారోగ్య సమస్యలతో గత నెలలో ఇరువురు మృతి చెందారు. తురకపాలెం తరహా అనుమానిత లక్షణాలు ఇక్కడి వారికి కూడా ఉన్నట్లు ఏకంగా రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ సమీక్ష సమావేశంలోనే వెల్లడించారు. అధికారులు మాత్రం ఈ విషయాన్ని తేలికగా తీసుకున్నారు. ఇంటింటి సర్వే నిర్వహించామని, ప్రమాదకరమైన లక్షణాలు ఏమీ లేవని చెబుతున్నారు. తొమ్మిదిమంది అనుమానితుల నుంచి రక్త నమూనాలు సేకరించగా... వారిలో ఐదుగురికి నెగిటివ్ వచ్చినట్లు తెలిపారు. మిగిలిన నలుగురికి కోకై బ్యాక్టీరియా లక్షణాలు ఉన్నట్లు స్థానిక వైద్యాధికారిణి డాక్టర్ ఊర్మిళ చెబుతున్నారు.
విజృంభిస్తున్న జ్వరాలు....
చేబ్రోలుతోపాటు గ్రామ శివార్లలో జ్వరాలు విజృంభిస్తున్నాయి. పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా వేదికగానే కార్యక్రమాలు నిర్వహిస్తున్నా, ఏనాడు పంచాయతీలలో పారిశుధ్యం గురించి సమీక్షించిన పాపాన పోలేదు. ముఖ్యంగా తురకపాలెం, చేబ్రోలు సహా ఇతర గ్రామాల్లో పారిశుధ్యం అధ్వానంగా తయారైంది. చేబ్రోలులో ఏడు దళితవాడలు ఉండగా.. ఆయా ప్రాంతాల్లో పారిశుధ్య మెరుగుదలకు తీసుకుంటున్న చర్యలు నామమాత్రంగా ఉన్నాయి.
ప్రతి ఇంట్లోనూ జ్వర బాధితులు
వర్షాలు కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచి దోమలు వ్యాప్తి పెరిగింది. డ్రైనేజీ వ్యవస్థ సమస్యగా ఉంది. గ్రామంలో ప్రస్తుతం ప్రతి ఇంట్లో జ్వరాలతో బాధపడుతున్నారు. తురకపాలెంలో 109 మంది జ్వరపీడితుల నుంచి బ్లడ్ కల్చర్ పరీక్షలు చేయగా నలుగురికి మెలియోడోసిస్ ఉన్నట్లు గుర్తించారు. వీరిలో ఒకరు మరణించగా ముగ్గురు కోలుకున్నారు. పరీక్షలు చేసిన 1,501 మందిలో 48 శాతం మందికి రక్తహీనత ఉందని గుర్తించారు. 49 శాతం మందికి ఏదో ఒక ఇన్‌ఫెక్షన్లు ఉన్నట్లు తేలింది. వీటన్నింటికీ కారణాలు అన్వేషించకుండా ఆర్‌ఎంపీలు అధిక మోతాదులో యాంటీబయోటిక్స్ ఇవ్వడం వల్లే ఇలా జరిగిందనే ప్రచారానికి కూటమి ప్రభుత్వం తెరలేపింది. వారు ప్రైవేటు ఆసుపత్రుల్లో తీసుకున్న చికిత్సలు, వాడిన మందులపై కూడా వివరాలు సేకరిస్తే వాస్తవాలు బయటపడే అవకాశం ఉంది.

నిన్న తురకపాలెం.. నేడు కొత్తరెడ్డిపాలెం

నిన్న తురకపాలెం.. నేడు కొత్తరెడ్డిపాలెం