
ఉధృతంగా గుంటూరు చానల్ ప్రవాహం
పెదకాకాని: గుంటూరు చానల్ ఉధృతంగా ప్రవహిస్తుండటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. గత నెల 12వ తేదీన రాత్రి కురిసిన వర్షాలకు గుంటూరు చానల్‌కు గండి పడటంతోపాటు కట్టలపై నీరు పొంగి ప్రవహించింది. దీంతో మొక్క దశలో ఉన్న వరి పొలాలు నీట మునిగాయి. ప్రస్తుతం శనివారం కురిసిన వర్షానికి పెద్ద మొత్తంలో గుంటూరు చానల్‌కు నీరు వచ్చి చేరింది. కాలువకు కూడా నీరు ఎక్కువగా విడుదల చేయడంతో అంచులను తాకుతూ ప్రవహిస్తోంది. గుంటూరు జిల్లా సీతానగరం వద్ద ప్రారంభమైన గుంటూరు చానల్ (కొత్తకాలువ) 47 కిలోమీటర్ల పొడవున విస్తరించి ఉంది. కాలువ పొడవునా ప్రజలు నీటిని సాగు, తాగు అవసరాలకు ఉపయోగించుకుంటున్నారు. కాలువ కట్టలను పటిష్టం చేయకపోవడంతో ఎక్కడ గండి పడుతుందోనని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలువ లాకులకు తూటికాడ, గుర్రపుడెక్క అడ్డపడిన ప్రాంతంలో నీటి పరిమాణం మరింతగా పెరిగి కట్టలను తాకుతోంది. ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, సంబంధిత యంత్రాంగం స్పందించి చర్యలు తీసుకోవాలని పలువురు రైతులు కోరుతున్నారు.