
లోక్ అదాలత్‌లో 11,388 కేసులు పరిష్కారం
గుంటూరు లీగల్: జాతీయ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థల ఆదేశాల మేరకు శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్‌లో మొత్తం 11,388 కేసుల పరిష్కారం అయ్యాయి. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయి కల్యాణ చక్రవర్తి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 41 బెంచీలను ఏర్పాటు చేశామన్నారు. జిల్లా వ్యాప్తంగా 908 సివిల్ కేసులు, 10,480 క్రిమినల్ కేసులు పరిష్కరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా, కాటూరు గ్రామం వద్ద జరిగిన ప్రమాదంలో యార్లగడ్డ శ్రీనివాసులు మరణించిన క్లెయిమ్ కేసులో వారి కుటుంబానికి యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్సు తరఫున రూ.1,11,82,343 అందించి, పరిష్కారం చేసుకున్నారు. సంబంధిత చెక్కును బాధితుల తరఫు న్యాయవాది వి.బ్రహ్మారెడ్డి , బీమా కంపెనీ తరఫు న్యాయవాది పి.రామాంజనేయులు, కంపెనీ మేనేజర్ సమక్షంలో బాధితులకు జిల్లా జడ్జి అందజేశారు.