
పాలకవర్గం నియామకానికి మల్లగుల్లాలు
వర్గాల పోరుతో కూటమి పాలకులు వెనుకడుగు శ్రీ పానకాల లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో ఇదీ పరిస్థితి
మంగళగిరి: రాజధానిలో ప్రతిష్టాత్మకమైన మంగళాద్రిలో వేంచేసి వున్న శ్రీ పానకాల లక్ష్మీనృసింహస్వామి ఆలయ పాలకవర్గం నియామకంపై కూటమి ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. ఆగస్టు 26వ తేదీతోనే పాలక వర్గానికి దరఖాస్తులు దాఖలు ముగియగా, 36 మంది కూటమి నాయకులు దరఖాస్తు చేశారు. ఆలయ అధికారులు వాటిని దేవదాయ శాఖ కమిషనర్ కార్యాలయానికి పంపారు. రాజకీయ జోక్యం అధికం కావడం, పాలకవర్గ సభ్యులను నియమించేందుకు కూటమి నాయకులలో పోటీ, పదవులు విక్రయించుకున్నారనే విమర్శలతో ప్రభుత్వం ముందడుగు వేయలేకపోతోంది. భారీగా ఆదాయం వచ్చే ఆలయ కావడంతో పాలకవర్గం తమ చేతులలో ఉంచుకోవాలని కూటమి పార్టీలు పట్టుదలతో ఉన్నాయనే చర్చ జోరుగా సాగుతోంది. పాలకవర్గంలో ఎక్స్ అఫీషియో సభ్యుడితో కలిపి 12 మంది సభ్యులకు అవకాశం ఉంది. ట్రస్ట్ బోర్డు చైర్మన్ సహా ఇతర పదవులలో అధికంగా తమ వారిని నియమించాలని బీజేపీ పట్టుపడుతున్నట్లు తెలిసింది. ఇదే స్థాయిలో జనసేన, టీడీపీ నుంచి కూడా పోటీ అత్యధికంగా ఉంది. పాలక వర్గం నియామకంపై ప్రభుత్వం, మంత్రి ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు సమాచారం. పాలకవర్గాన్ని వెంటనే నియమించి ఉత్కంఠకు తెరదించాలని కూటమి పార్టీల నాయకులు కోరుతున్నారు.