
22న చలో అసెంబ్లీ జయప్రదం చేయండి
ఏపీ కౌలు రైతు సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హరిబాబు
నరసరావుపేట: కౌలు రైతుల సంక్షేమం, హామీల అమలుకు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈనెల 22న విజయవాడలో నిర్వహించే చలో అసెంబ్లీ కార్యక్రమంలో కౌలు రైతులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఏపీ కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.హరిబాబు పిలుపునిచ్చారు. శనివారం కోటప్పకొండ రోడ్డులోని పల్నాడు విజ్ఞాన కేంద్రంలో చలో అసెంబ్లీ ర్యాలీ కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హరిబాబు మాట్లాడుతూ కౌలు రైతులను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 400 మంది రైతులు, కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఆయా కుటుంబాలను పరామర్శించలేదని, పరిహారం ఇవ్వలేదని మండిపడ్డారు. అసెంబ్లీ, మండలిలో మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు కౌలు రైతు కొత్త చట్టం అమలుకు కృషిచేయాలన్నారు. సంఘం రాష్ట్ర అధ్యక్షులు వై రాధాకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వ అసమర్థ విధానాలే కౌలు రైతుల ఆత్మహత్యలకు దారితీస్తున్నాయన్నారు. కౌలు రైతుల సంక్షేమం కోసం సంఘం ఆధ్వర్యంలో దశలవారీ పోరాటాలు చేస్తామన్నారు. కౌలు రైతు సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షులు కామినేని రామారావు, సంఘం నాయకులు టి.పెద్దిరాజు, కె.ఆంజనేయులు, అమరలింగేశ్వరరావు పాల్గొన్నారు.