
గురువుల స్థానం మహోన్నతం
గుంటూరు ఎడ్యుకేషన్: ప్రపంచంలోని అత్యున్నత స్థానాలను అధిరోహించేలా విద్యార్థులను తీర్చి దిద్దగల మహోన్నతమైన వారు విద్య నేర్పించే గురువులు అని జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా పేర్కొన్నారు. మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా శుక్రవారం కలెక్టరేట్ వద్ద ఉన్న రెవెన్యూ కల్యాణ మండపంలో జిల్లాస్థాయి గురుపూజోత్సవాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న హెనీ క్రిస్టినా మాట్లాడుతూ గురువులు తరగతి గదుల్లో చేస్తున్న కృషి, ప్రోత్సహం వల్లే సమాజంలో ఎంతో మంది ఉన్నత స్థాయిలో జీవిస్తున్నారని చెప్పారు. నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ సమాజాభివద్ధిలో గురువులు భావిభారత పౌరులైన విద్యార్థులను తీర్చిదిద్దిన విధానమే కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలకు వచ్చే నిరుపేద విద్యార్థులను సమర్థమైన పౌరులుగా తీర్చదిద్దడంలో గురువుల పాత్ర కీలకమైందని తెలిపారు. పశ్చిమ నియోజకవర్గ గళ్లా మాధవి మాట్లాడుతూ జ్ఞాన జ్యోతులు వెలిగించి అజ్ఞాన అంధకారాల నుంచి విజ్ఞానం వైపు నడిపించే సమాజ రూపకర్తలే గురువులని చెప్పారు. రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ మన్నవ మోహనకృష్ణ, జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుక పాల్గొన్నారు. జిల్లాలో తొమ్మిది మంది ప్రధానోపాధ్యాయులు, 20 మంది స్కూల్ అసిస్టెంట్ టీచర్లు, 25 మంది ఎస్జీటీలతో కలుపుకుని మొత్తం 54 మందిని ఉత్తమ ఉపాధ్యాయులుగా సత్కరించారు. కార్యక్రమంలో నగర డిప్యూటీ మేయర్ షేక్ సజీలా, డీవైఈవోలు శాంతకుమారి, ఏసురత్నం, ఎంఈవోలు పాల్గొన్నారు.