
తురకపాలెంలో వరుస మరణాలపై పరిశీలన
గుంటూరు రూరల్: మండలంలోని తురకపాలెంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ శుక్రవారం పర్యటించారు. గ్రామంలో బాధితుల ఇళ్లకు వెళ్లి పరామర్శించారు. రాష్ట్ర ప్రభుత్వంఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన హెల్త్ క్యాంప్‌ను స్థానిక ఎమ్మెల్యే రామాంజనేయులుతో కలిసి పరిశీలించారు. అందుబాటులో ఉంచిన మెడిసిన్స్, పరీక్ష యంత్రాలు, ఏర్పాట్ల గురించి వైద్య సిబ్బందిని ఆయన అడిగి తెలుసుకున్నారు.అనంతరం మాట్లాడుతూ గ్రామంలో వరుస మరణాలపై పరిశీలన చేశామని తెలిపారు. బర్కోల్డేరియా సూడోమలై అనే బ్యాక్టీరియా వల్ల జ్వరాలు వచ్చి కొందరు మరణించారని చెప్పారు. మెలియాయిడోసిస్ అనేది చాలా అరుదైన వ్యాధి అని, దాని వల్ల శరీరంలో రోగనిరోధకశక్తి తక్కువగా ఉన్నవారికి ఇబ్బందులు వస్తాయని వివరించారు. యాంటీబయాటిక్ ద్వారా జబ్బు తగ్గించవచ్చని చెప్పారు. అన్ని రకాల యాంటీబయాటిక్‌లు ఈ బ్యాక్టీరియాపై పని చేయవని, నాలుగైదు రకాలు మాత్రమే పనిచేస్తాయని తెలిపారు. జ్వరాలు ఉన్న వారి నుంచి రక్త నమూనాలు సేకరించారని, అనారోగ్యం బారిన పడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారని పేర్కొన్నారు. అరుదైన వ్యాధి కాబట్టే గుర్తించడంలో ఆలస్యం జరిగిందని, పరీక్షల ఫలితాలు రావడానికి సమయం పడుతుందని చెప్పారు. ఇది కామన్ డిసీజ్ కాదని, తాను డాక్టర్‌గా ప్రాక్టీస్ చేసిన సమయంలో కూడా చూడలేదని చెప్పారు. సరైన పరీక్షలు చేసిన తరువాత తేల్చి చెప్పగలమని మంత్రి తెలిపారు.