దర్జాగా ప్రైవేట్‌ దందా! | - | Sakshi
Sakshi News home page

దర్జాగా ప్రైవేట్‌ దందా!

Sep 6 2025 5:29 AM | Updated on Sep 6 2025 5:39 AM

ఆర్టీసీ బస్టాండ్‌ ఎదురు అడ్డదిడ్డంగా బస్సులు నిలుపుదల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం తీవ్ర ఇబ్బందులు పడుతున్న వాహనచోదకులు పట్టించుకోని పోలీసులు

చర్యలు తీసుకుంటాం

పట్నంబజారు: ఆర్టీసీ బస్టాండ్‌ వెలుపల రోడ్డుపై ప్రైవేట్‌ ట్రావెల్స్‌ దందా యథేచ్ఛగా సాగుతోంది. నడి రోడ్డుపైనే బస్సుల్ని నిలిపి, ప్రయాణికుల్ని ఎక్కించుకుంటున్నారు. దీనివల్ల ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదు. వాహనాలపై కొరడా ఝుళిపించాల్సిన ఆర్టీఏ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. కళ్ల ముందే ప్యాసింజర్లను హైజాక్‌ చేసి సంస్థ ఆదాయానికి గండికొడుతున్నా ఆర్టీసీ అధికారులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు.

నిబంధనలు బేఖాతర్‌

ఆర్టీసీ బస్టాండ్‌ ఎదురుగా 100పైగా ప్రైవేట్‌ ట్రావెల్స్‌ ఉన్నాయి. గుంటూరు నుంచి హైదరాబాద్‌, బెంగుళూరు, వైజాగ్‌, చైన్నె, తిరుపతితో అనేక దూర ప్రాంతాలకు బస్సులు నడుస్తున్నాయి. ఈ సమయంలో నిబంధనలు పాటించాల్సిన బస్సు యజమానులు వాటిని బేఖాతరు చేస్తున్నారు. ఆర్టీసీ బస్టాండ్‌ పరిధిలో రెండు కిలోమీటర్ల లోపు ఎటువంటి బస్సులు నిలపకూడదని మోటార్‌ వెహికల్‌ యాక్ట్‌ స్పష్టంగా చెబుతోంది. అయితే, దీనిపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఆర్టీఏ అధికారులపై ఉంది. తనిఖీలు నిర్వహించి కేసులు నమోదు చేయాల్సిన బాధ్యత, ఫోర్స్‌ను రంగంలోకి దించి చర్యలు తీసుకోవాల్సిన కనీస విషయాన్ని వారు మరిచిపోయారు. ప్రస్తుతం ఆర్టీసీ ఉన్నతాధికారులు కూడా ఒక రోజు విధుల్లో ఉంటే.. నాలుగు రోజులు సెలవులో ఉంటున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఏం పట్టించుకుంటారని ఆర్టీసీ అధికారులు, సిబ్బంది బాహటంగానే విమర్శిస్తున్నారు. పలుమార్లు విన్నవించినప్పటికీ కనీసం మోటార్‌ వెహికల్‌ ఇన్స్‌పెక్టర్‌ (ఎంవీఐ), సిబ్బందిని కేటాయించకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

ట్రాఫికర్‌తో నరకం

ఇష్టారాజ్యంగా ప్రైవేటు వాహనాలను ఆర్టీసీ బస్టాండ్‌ వద్ద రోడ్డు పైనే నిలపడంతో ట్రాఫిక్‌ సంగతి చెప్పాల్సిన పనే లేదు. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 11గంటలకు పైగాను ప్రైవేట్‌ బస్సులను రోడ్డుపై అడ్డంగా పెట్టి, ప్రయాణికుల్ని ఎక్కించుకుని వెళుతున్నారు. దీనిపై ట్రాఫిక్‌ అధికారులను అడిగితే, నోటీసులు జారీ చేశామని చేతులు దులుపుకుంటున్నారు. దీనిపై ఒక సామాజిక కార్యకర్త జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా పరిస్థితుల్లో మార్పులేదు. ఆర్టీసీ బస్టాండ్‌ ప్రాంతలో బీట్‌ను చూసే అధికారులు కనీసం కన్నెత్తి చూడని పరిస్థితి కూడా ఉంది. ఒకవేళ ఎవరైనా ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ రోడ్డుపై అడ్డంగా పెట్టిన బస్సును తీయాలని చెప్పినప్పటికీ కనీసం పట్టించుకోకుండా, ప్రైవేట్‌ బస్సు డ్రైవర్‌ నోరు పారేసుకున్న పరిస్థితులున్నాయి. ప్రైవేట్‌ బస్సులు అంశంలో ఆర్టీఏ అధికారులు, ట్రాఫిక్‌ పోలీసులు వ్యవహరిస్తున్న తీరు బహిరంగ రహస్యమే ! నెలవారీ మామూళ్ళు ఇస్తున్న క్రమంలో మిన్నికుండిపోతున్నారనే ఆరోపణలు లేకపోలేదు. ఇప్పటికై నా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై డీటీసీ సీతారామిరెడ్డిని వివరణ అడిగే ప్రయత్నం చేసినప్పటీకీ ఆయన నుంచి ఎటువంటి స్పందన లేదు.

బస్టాండ్‌ దగ్గర ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సుల నిలుపుదలపై ప్రత్యేక దృషి సారించి చర్యలు తీసుకుంటాం. ట్రాఫిక్‌కు అంతరాయం కలుగకుండా చర్యలు చేపడతాం. సిబ్బందిని ఏర్పాటు చేసి బస్సులు నిలువకుండా యాక్షన్‌ తీసుకుంటాం.

–ఏ. అశోక్‌, ఈస్ట్‌ ట్రాఫిక్‌ సీఐ

దర్జాగా ప్రైవేట్‌ దందా!1
1/1

దర్జాగా ప్రైవేట్‌ దందా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement