
యూట్యూబ్ ద్వారా నేర్చుకుని చోరీలు
నగరంపాలెం: పార్కింగ్ చేసిన కార్ల అద్దాలను పగులకొట్టి నగదు, నగలు, ల్యాప్‌ట్యాప్‌లు దొంగలించే పాత నేరస్తుడ్ని అరెస్ట్ చేసినట్లు గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ తెలిపారు. రూ.6 లక్షల ఖరీదైన ల్యాప్‌టాప్‌లు, 11 గ్రాముల బంగారం, రూ.2 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. గుంటూరు నగరంపాలెంలోని జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలోని హాలులో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ కేసు వివరాలు వెల్లడించారు. గడిచిన రెండు నెలలుగా కార్ల అద్దాలను పగులకొట్టి నగలు, నగదు, ల్యాప్‌ట్యాప్‌లను తస్కరిస్తున్నారు. వరుస ఘటనలపై బాధితులు ఆయా పోలీస్‌స్టేషన్లల్లో ఫిర్యాదులు చేశారు. ఈ తరహా సంఘటనలు నల్లపాడు పీఎస్ పరిధిలో నాలుగు, నగరంపాలెం పీఎస్ పరిధిలో మూడు జరిగాయి. దీంతో సీసీఎస్, జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల (పీఎస్) పోలీస్ అధికార, సిబ్బందిని అప్రమత్తం చేశారు. చిన్న క్లూ ఆధారంగా చేసుకుని సీసీ కెమెరాల పుటేజీలను పరిశీలించి, నిందితుడిని గుర్తించామని ఎస్పీ చెప్పారు. పల్నాడు జిల్లా నాదెండ్ల మండలం గొరిజవోలు గ్రామ వాసి 33 ఏళ్ల జంగం బాజిని అదుపులోకి తీసుకుని విచారించామని తెలిపారు. నేరం రుజువుకావడంతో అరెస్ట్ చేశామన్నారు. అతని నుంచి రూ.6 లక్షల ఖరీదైన ల్యాప్‌ట్యాప్‌లు, 11 గ్రాముల బంగారం, రూ.2 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. నల్లపాడు పీఎస్ పరిధిలో– 4, నగరంపాలెం పీఎస్ పరిధిలో– 3, పెదకాకాని పీఎస్, పాత గుంటూరు పీఎస్, అరండల్‌పేట పీఎస్ పరిధిలో ఒక్కొక్క కేసు నిందితుడిపై నమోదైందని వివరించారు.
రౌడీషీట్ కూడా..
2022లో పల్నాడు జిల్లా నరసరావుపేట ఒకటో పట్టణ పీఎస్ పరిధిలో జరిగిన ఓ హత్య కేసులో బాజీ నిందితుడని, రౌడీషీట్ కూడా ఉందని ఎస్పీ తెలిపారు. చోరీలు చేసే విధానాన్ని యూట్యూబ్ ద్వారా నేర్చుకున్నాడని చెప్పారు. చేతులకు గ్లౌజ్‌లు, తలకు హెల్మెట్ ధరించి, గులక రాళ్లతో కార్ల అద్దాలను ధ్వంసం చేసేవాడని విచారణలో తెలిసినట్లు వివరించారు. చాకచక్యంగా వరుస కేసులను ఛేదించిన నల్లపాడు పీఎస్ సీఐ వంశీధర్, సీసీఎస్ సీఐ అనురాధ, ఎస్‌ఐ చల్ల వాసు, హెడ్ కానిస్టేబుల్ సుబ్బారావు, కానిస్టేబుళ్లు సాంబశివరావు, భిక్షునాయక్, మస్తాన్‌వలిని జిల్లా ఎస్పీ అభినందించారు. అనంతరం ప్రశంసా పత్రాలు అందించారు. సమావేశంలో దక్షిణ సబ్ డివిజనల్ డీఎస్పీ భానోదయ, నల్లపాడు పీఎస్ సీఐ వంశీధర్ పాల్గొన్నారు.