
అర్ధరాత్రి కారు బీభత్సం
తాడేపల్లి రూరల్: మంగళగిరి ప్రకాశం బ్యారేజ్ పాత జాతీయ రహదారిలో ఉండవల్లి సెంటర్ నుంచి మంగళగిరి వెళ్లే మార్గంలో సోమవారం అర్ధరాత్రి ఓ కారు బీభత్సం సృష్టించి పలుచోట్ల ద్విచక్ర వాహనదారులను, ఒక సైక్లిస్టును ఢీకొట్టి చివరకు ఒక చెట్టును ఢీకొని నిలిచిపోయింది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం అర్ధరాత్రి ఉండవల్లి సెంటర్ నుంచి మంగళగిరి వెళుతున్న పోలీస్ స్టిక్కర్ కలిగి వున్న ఒక కారు సాయిబాబా గుడివద్ద విజయవాడ నుంచి మంగళగిరి వెళ్తున్న ఆటోను ఢీకొట్టింది. ఆ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న డ్రైవర్‌తోపాటు భార్యాభర్తలకు స్వల్పగాయాలయ్యాయి. కారు ఆపినట్లు ఆపి మళ్లీ అతివేగంగా వచ్చి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ వద్ద సైకిల్‌పై వెళ్తున్న ఓ వ్యక్తిని, ద్విచక్రవాహనంపై వెళుతున్న మరో వ్యక్తికి ఢీకొట్టడంతో వారు కింద పడ్డారు. కారు అదుపు తప్పి ఓ చెట్టును ఢీకొని ఆగిపోయింది. కారులో బెలూన్స్ సైతం ఓపెన్ అయ్యాయి. పూటుగా మద్యం సేవించి ఉన్న ఓ వ్యక్తి కారులోంచి దిగి అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. కారుపై పోలీస్ అని స్టిక్కర్ ఉంది. ఇది పోలీసులకు చెందిన వాహనమా? లేక ఇంకెవరైనా పోలీస్ స్టిక్కర్ అతికించుకున్నారా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తాడేపల్లి పోలీసులు గోప్యంగా వివరాలు సేకరిస్తున్నారు.