
‘పది’ సర్టిఫికెట్లు మాయం.. కలకలం
మంగళగిరి: మంగళగిరి–తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఆత్మకూరు జాతీయ రహదారి వెంట నిర్మల హైస్కూలులో సీబీఎస్‌ఈ 10వ తరగతి సర్టిఫికెట్లు మాయమవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. తమ పిల్లల సర్టిఫికెట్లు కావాలని విద్యార్థుల తల్లిదండ్రులు సోమవారం పాఠశాల యాజమాన్యాన్ని అడగ్గా.. సర్టిఫికెట్లు కనిపించడం లేదంటూ సమాధానం రావడంతో కంగుతిన్నారు. దీంతో వారు పాఠశాల వద్ద ఆందోళనకు దిగారు. యాజమాన్యం సర్టిఫికెట్లు మాయం కాలేదని అందరికీ సర్టిఫికెట్లు అందిస్తామని సర్ధి చెప్పే ప్రయత్నం చేశారు. ఈ నేపధ్యంలో తల్లిదండ్రులు ఎంఈఓ కార్యాలయానికి చేరుకుని ఆందోళన చేశారు.
● దీనిపై విద్యాశాఖ డిప్యూటీ డీఈఓ శాంతకుమారి, ఎంఈఓ ఉషాకుమారిలు మాట్లాడుతూ జూన్ 23వ తేదీన సర్టిఫికెట్లు పాఠశాలకు రిజిస్టర్ పోస్టులో పంపామని, క్లర్క్ రత్నకుమారి సంతకం చేసి తీసుకున్నట్లు తెలిపారు. డెప్యూటీ డీఈఓ శాంత కుమారి స్కూల్ ప్రిన్సిపాల్ శిరీషను తన కార్యాలయానికి పిలిపించి సర్టిఫికెట్‌లపై ప్రశ్నించగా జూన్ 23వ తేదీన సర్టిఫికెట్లు వచ్చాయని, తమ క్లర్క్ ఎక్కడో పెట్టి మర్చిపోయిందని నింపాదిగా సమాధానం ఇవ్వడంతో ఆమె ఆగ్రహించారు. జూన్‌లో వచ్చిన సర్టిఫికెట్లు మాయమైతే.. ఇప్పటివరకు తమకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేయగా ఆర్జేడీ కార్యాలయానికి ఫిర్యాదు చేశామని ప్రిన్సిపాల్ తెలిపారు.
● క్లర్క్ రత్నకుమారి తాను రిజిస్టర్ పోస్టులో సంతకం మాత్రమే చేశానని, సర్టిఫికెట్ల బండిల్ తనకు ఇవ్వలేదని అధికారులకు చెప్పడం విశేషం. ఆర్జేడీ కార్యాలయానికి చేసిన ఫిర్యాదు కాపీతో పాటు సర్టిఫికెట్ల మాయం పూర్తి వివరాలు సేకరించిన డిప్యూటీ డీఈఓ శాంతకుమారి డీఈఓ విజయలక్ష్మికి సమాచారమివ్వగా, డీఈఓ సూచనల మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
● పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యమే సర్టిఫికెట్ల మాయానికి కారణమని, పైగా ఇంగ్లిష్, తెలుగు మీడియంల నిర్వాహకుల మధ్య కొద్దిరోజులుగా అంతర్గత వివాదం కొనసాగుతుందని, ఈ నేపధ్యంలో సర్టిఫికెట్లు మాయమయ్యాయని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వెంటనే ప్రభుత్వం కల్పించుకుని సర్టిఫికెట్లు త్వరగా వచ్చేలా చూసి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
నిర్మల సీబీఎస్‌ఈ హైస్కూల్‌లో ఘటన
విద్యాశాఖ అధికారులకు
తల్లిదండ్రుల ఫిర్యాదు
పోలీసులకు ఫిర్యాదు చేసిన
డిప్యూటీ డీఈఓ

‘పది’ సర్టిఫికెట్లు మాయం.. కలకలం