
ప్రకృతి వ్యవసాయ క్షేత్రాల సందర్శన
తెనాలి: ఆచార్య ఎన్‌జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు గుంటూరు జిల్లా ప్రకృతి వ్యవసాయ అధికారి కె.రాజకుమారి సమక్షంలో వివిధ ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను సోమవారం సందర్శించి, ప్రత్యక్షంగా పరిశీలించారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ప్రయోజనాలు, ఫలితాలు, రైతుల అనుభవాలను నేరుగా అవగాహన చేసుకున్నారు. తెనాలి రూరల్ మండలం గ్రామం ఎరుకలపూడిలో రైతు విజయలక్ష్మి వరి పొలంలో ఏర్పాటు చేసిన గట్టు మోడల్ వద్ద, ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయ (ఏపీసీఎన్‌ఎఫ్) తొమ్మిది సార్వత్రిక సూత్రాలను వీక్షించారు. జిల్లా ప్రకృతి వ్యవసాయ అధికారి కె.రాజకుమారి ఈ సూత్రాల విశిష్టత, వరి సాగులో గట్టు మోడల్ ప్రత్యేకతను వివరించారు. విజయలక్ష్మి, రంగయ్య తదితర రైతుల పది ఎకరాల వరి పొలం బ్లాక్‌ను పరిశీలించిన శాస్త్రవేత్తలు, ప్రకృతి వ్యవసాయంలో ‘బీఆర్‌ఐఎక్స్’ విలువలు 12 శాతంగా ఉండగా, రసాయనిక వ్యవసాయంలో 9 శాతమే నమోదైనట్లు గమనించారు. అనంతరం ప్రకృతి వ్యవసాయ బయోరిసోర్స్ సెంటర్‌ను సందర్శించారు.
● కొల్లిపర మండలం దావులూరిపాలెం గ్రామంలో రైతు వసంతమ్మ ఏ–గ్రేడ్ 365 డీజీసీ మోడల్ అరటి తోటను సందర్శించారు. ఇక్కడ బీఆర్‌ఐఎక్స్ విలువలు ప్రకృతి వ్యవసాయంలో 11 శాతం, రసాయనిక వ్యవసాయంలో 7 శాతం నమోదు కావటాన్ని గమనించారు. అదే గ్రామంలో మాణిక్యమ్మ అరటి–చామగడ్డ మోడల్ పంటను, శ్రీలక్ష్మీ సూర్య మండల మోడల్ పెరటి తోటను పరిశీలించారు. కొల్లిపర గ్రామంలో రాధాకృష్ణ స్వయంసహాయ సంఘ సభ్యులతో సమావేశమై, రైతుల అనుభవాలను విని వారిని శాస్త్రవేత్తలు అభినందించారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ఫలితాలను ప్రత్యక్షంగా గమనించిన శాస్త్రవేత్తలు, తమ విజ్ఞానాన్ని రైతు లతో పంచుకుంటూ, ప్రకృతి వ్యవసాయ పరంగా రైతులు సాధిస్తున్న ప్రగతిని ప్రశంసించారు. విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలతో పాటు ఆర్‌వైఎస్‌ఎస్ సీనియర్ థిమాటిక్ లీడ్ జాకిర్, సీనియర్ అసోసియేట్ వరలక్ష్మి, థిమాటిక్ పాయింట్ పర్సన్ అపర్ణ, జిల్లా ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు.