
ప్రగతి పనులపై నిరంతర సమీక్షలు
గుంటూరు వెస్ట్: గుంటూరు ప్లారమెంట్ పరిధిలో ప్రారంభమైన అభివృద్ధి పనులపై అధికారులు, ప్రజాప్రతినిధులతో నిరంతర సమీక్షలు నిర్వహించి మరింత వేగంగా పూర్తి చేసేందుకు యత్నిస్తున్నామని కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. శనివారం స్థానిక కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ అహ్మద్, అధికారులతో రైల్వే ప్రాజెక్టులు, హౌసింగ్‌పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడుతూ న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ ఆధునికీకరణకు కేంద్ర ప్రభుత్వం రూ.5 కోట్లు నిధులు మంజూరు చేసిందన్నారు. పెదకాకాని ఆర్వోబీ నిర్మాణాలకు సంబంధించి కొన్ని ఇబ్బందులున్నాయని తెలిపారు. స్థానికంగా ఉండే కొన్ని ఇళ్లు తొలగించాల్సి ఉంటుందని, వారి అంగీకారం లభించిన వెంటనే పనులు వేగం పెంచుతామన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం, నగర మేయర్ కోవెలమూడి రవీంద్రబాబు, డీఆర్వో షేఖ్ ఖాజావలి, డీసీసీబీ చైర్మన్ మక్కెన మల్లికార్జునరావు, రైల్వే ఆర్‌డీఎం సుదేశ్నసేన్, గతి శక్తి డిప్యూటీ సీఈ నోయల్ పాల్గొన్నారు.
– కేంద్ర సహాయ మంత్రి
డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్