
ఇద్దరు గంజాయి విక్రేతలు అరెస్టు
2.2 కిలోల సరుకు స్వాధీనం
లక్ష్మీపురం: గంజాయి విక్రయిస్తున్న ఇద్దరిని అరెస్టు చేసినట్లు నగరంపాలెం సీఐ ఎం.నజీర్‌బేగ్ తెలిపారు. పోలీసు స్టేషన్‌లో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జిల్లా ఎస్పీ ఎస్.సతీష్‌కుమార్, వెస్ట్ డీఎస్పీ కె.అరవింద్ ఆదేశాల మేరకు జిల్లా పరిషత్ క్వార్టర్స్ వెనుక ఖాళీ స్థలంలో గంజాయి విక్రయిస్తున్నారనే సమాచారంతో తనిఖీలు చేపట్టామన్నారు. ఆరుగురిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. వీరిలో తండ్రి, కొడుకులు చెడు వ్యసనాలకు బానిసలై గంజాయి విక్రయిస్తున్నట్లు తేలిందన్నారు. పల్నాడు జిల్లా మాచర్ల ప్రాంతం నుంచి గంజాయి తెచ్చి గుంటూరు నగరంలో విక్రయిస్తున్నట్లు గుర్తించామని తెలిపారు. ఇద్దర్ని అరెస్టు చేశామని, వారి నుంచి కొనుగోలు చేస్తున్న నలుగురు వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్నామని వివరించారు. 2.2 కేజీల గంజాయి, ద్విచక్ర వాహనాన్ని, కొంత నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.