
బార్ లకు దరఖాస్తుల విషయంలో కూటమి నేతల సిండికేటు
బార్ లైసెన్సుల కోసం దరఖాస్తులు అరకొరే
గడువులోగా 32 బార్లకే నిబంధన మేరకు దాఖలు
డిపాజిట్లు, ఫీజులు తగ్గించుకొనే ఎత్తుగడలో సిండికేట్లు
నేడు కలెక్టరేట్‌లో లాటరీ ప్రక్రియకు సన్నాహాలు
బార్లు దక్కించుకునేందుకు కూటమి నేతల సిండికేట్ కుయుక్తులు గెలిచాయి. మద్యం అమ్మకాలతో పెద్ద ఎత్తున ఆదాయం సమకూర్చుకుంటున్న సర్కార్.. ఇప్పుడు తమవారికి బార్లను తక్కువ మొత్తానికే కట్టబెట్టేలా వ్యవహరిస్తోంది. ఇప్పటికే మద్యం దుకాణాలు దాదాపుగా అన్నీ కూటమి నేతల చేతిలో ఉన్నాయి. బార్ల ఏర్పాటులో ప్రభుత్వ ఖజానాకు గండికొట్టడమే కాకుండా... తమ జేబులు నింపుకొనే పనిలో ఉన్నారు.
సాక్షి ప్రతినిధి, గుంటూరు, నెహ్రూనగర్: జిల్లాలో మొత్తం 110 బార్ అండ్ రెస్టారెంట్లకు దరఖాస్తులు ఆహ్వానించారు. శుక్రవారం గడువు ముగిసేనాటికి గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో 73గాను 24 బార్లకు మాత్రమే దరఖాస్తులు వచ్చాయి. మంగళగిరి, తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో 17కుగాను 7 బార్లకు, తెనాలి మున్సిపాలిటీలో 17కుగాను ఒక బార్‌కు, పొన్నూరు మున్సిపాలిటీ పరిధిలో 3 బార్లకు ఒక్క దరఖాస్తు కూడా దాఖలు కాలేదు. మొత్తగా 32 బార్లకు శనివారం లాటరీ ద్వారా కేటాయింపులు చేయనున్నారు. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ఒక్కో బార్‌కు రూ.75 లక్షలు లైసెన్సు ఫీజు, రూ.5 లక్షలు దరఖాస్తు ఫీజు, రూ.10 వేలు ఎన్‌రోల్ ఫీజు కింద కట్టాలని ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. బార్‌కు లాటరీ తీయాలంటే కనీసం 4 దరఖాస్తులు రావాలని నిబంధన పెట్టింది. ఇలా 4 దరఖాస్తులకు రూ.5 లక్షల చొప్పున రూ.20 లక్షలు ప్రభుత్వానికి రానుంది. మిగిలిన ప్రాంతాల్లో రూ.55 లక్షలు లైసెన్స్ ఫీజుగా ఖరారు చేసింది.
మద్యం వ్యాపారులందరూ సిండికేట్?
బార్లలో ఆదాయం పెంచుకునేందుకు ఎత్తుగడ వేసిన కూటమి మద్యం వ్యాపారుల సిండికేట్ బార్లకు దరఖాస్తులు చేసేందుకు ముందుకు రాలేదు. లైసెన్సు ఫీజును మరింతగా తగ్గించుకునేందుకు ఇలా చేస్తున్నట్లు సమాచారం. వాస్తవానికి ఆగస్టు 18న ప్రభుత్వం జనరల్ కేటగిరీలోని బార్లకు, 20న గీత కార్మికుల బార్ల ఏర్పాటుకు నోటిఫికేషన్ ఇచ్చింది. 26 తేదీ గడువు ముగిసే నాటికి ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. దీంతో 29 వరకు గడువు పొడిగించారు. 29వ తేదీ రాత్రి తొమ్మిది గంటల సమయానికి 110 బార్లకు 136, గీత కార్మికులకు కేటాయించిన 10 బార్లకు 58 దరఖాస్తులు వచ్చాయి. అయితే ప్రతి బార్‌కు నాలుగు దరఖాస్తులు కచ్చితంగా ఉండాలనే నిబంధన ప్రకారం చూస్తే కేవలం 32 బార్లకు మాత్రమే లాటరీ అవకాశం వచ్చింది. మిగిలిన వాటికి ఒకటి రెండు దరఖాస్తులే వచ్చాయి. మద్యం వ్యాపారులు ఉద్దేశపూర్వకంగానే బార్లకు దరఖాస్తులు వేయడం లేదని తెలుస్తోంది. ఒక్కో బార్‌కు గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో రూ.75 లక్షలు, మిగిలిన మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్, తెనాలి, పొన్నూరు మున్సిపాలిటీల్లో ఉన్న రూ.55 లక్షల లైసెన్సు ఫీజును తగ్గించుకునేందుకే మద్యం వ్యాపారులు ఇలా చేస్తున్నట్లు సమాచారం. శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల వరకు దరఖాస్తు సమయం ఉండటంతో వాటి సంఖ్య పెరుగుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
అధికారులకు తిప్పలు
బార్ల దరఖాస్తులు, లాటరీ, లైసెన్సుల వ్యవహారాలను సజావుగా పూర్తిచేసే బాధ్యతలను ప్రభుత్వం ఎకై ్సజ్ అధికారులపై పెట్టింది. సిండికేట్‌గా మారి లైసెన్సు ఫీజు తగ్గించుకోవాలనుకుంటున్న మద్యం వ్యాపారులు ఉద్దేశపూర్వకంగానే బార్లకు దరఖాస్తులు వేయడం లేదు. అన్ని బార్లకు దరఖాస్తులు వచ్చేలా చూడాలని ఇప్పటికే ఉన్నతాధికారులు అల్టిమేటం జారీ చేశారు. దీంతో జిల్లా ఎకై ్సజ్ అధికారులు మాత్రం మద్యం వ్యాపారులను పదేపదే కోరినా స్పందన రాలేదు.
ఎమ్మెల్యేల చేతిలో ‘గీత కులాల’ దరఖాస్తులు
గుంటూరు జిల్లాలో గీత కులాలకు 10 బార్లు కేటాయించారు. ఇందులో గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ఆరు, మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో రెండు, తెనాలి మున్సిపాలిటీ పరిధిలో రెండు చొప్పున ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో తమ అనుకునే వారే దరఖాస్తు చేసుకునేలా స్థానిక ఎమ్మెల్యేలు పావులు కదిపారు. బయట వ్యక్తులు దరఖాస్తు చేయడానికి ప్రయత్నిస్తే పిలిచి విరమించుకునేలా చేస్తున్నారు. శనివారం కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్ శంకరన్ హాల్‌లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఉదయం 8 గంటలకు లాటరీ ప్రక్రియ జరగనుంది.