
ద్విచక్ర వాహనాల చోరీ కేసులో వ్యక్తి అరెస్టు
10 వాహనాలు, ఆటో స్వాధీనం వివరాలు వెల్లడించిన వెస్ట్ డీఎస్పీ కె.అరవింద్
లక్ష్మీపురం : ఇళ్ల ముందు పార్కింగ్ చేసిన వాహనాలను చోరీ చేసే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి 10 ద్విచక్రవాహనాలు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్న ఘటన ఆదివారం చోటు చేసుకుంది. వెస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీ కె.అరవింద్ తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు కె.వి.పి కాలనీకి చెందిన తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు అలియాస్ వెంకటేష్ వాసు దుర్వసనాలకు అలవాటు పడి దొంగతనాలు ప్రారంభించాడు. గుంటూరు నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో ఇళ్ల ముందు పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాలను చోరీ చేస్తున్నాడు. వాటిని అమ్మగా వచ్చిన డబ్బులతో జల్సాలు చేస్తున్నాడు. ఇటీవల గోరంట్ల గ్రామానికి చెందిన ఏరువ శ్రీదేవి నగరంపాలెం పరిధిలో ద్విచక్ర వాహనం చోరీ అయినట్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ ఆదేశాల మేరకు వెస్ట్ సబ్ డివిజన్ డీఎస్పీ కె.అరవింద్, నగరంపాలెం సీఐ నజీర్‌బేగ్, పట్టాభిపురం సీఐ గంగా వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఎస్‌ఐలు రాంబాబు, ప్రసన్న, రామాంజనేయులు బృందాలుగా ఏర్పడి తనీఖీలు ముమ్మరం చేశారు. ఆదివారం నగరంలోని చుట్టుగుంట ప్రాంతంలో వాహనాలు తనిఖీలు చేస్తున్న సమయంలో తమ్మిశెట్టి వెంకటేశ్వర్లు ఇద్దరు మైనర్లతో కలిసి ద్విచక్ర వాహనంపై ట్రిపుల్ డ్రైవింగ్ చేస్తూ వెళుతుండగా పోలీసులను చూసి వెనకకు తిప్పి పారిపోయేందుకు ప్రయత్నించాడు. నగరంపాలెం ఎస్‌ఐ రాంబాబు వారిని అదుపులో తీసుకుని స్టేషన్‌కు తరలించి విచారించారు. ఇందులో ద్విచక్ర వాహనాలను చోరీ చేసి కె.వి.పి కాలనీ చివరలో ఒక ప్రదేశంలో పెట్టినట్లు చెప్పారు. దీంతో సిబ్బందితో కలిసి చోరీ చేసిన 10 ద్విచక్రవాహనాలను, ఒక ఆటోను స్వాధీనం చేసుకుని స్టేషన్‌కు తరలించారు. చోరీ చేసిన వాహనాల విలువ రూ.7లక్షల వరకు ఉంటుందని డీఎస్పీ అరవింద్ తెలిపారు. వెంకటేశ్వర్లును అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఆయన చెప్పారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన పోలీస్ సిబ్బందిని అభినందించారు.

ద్విచక్ర వాహనాల చోరీ కేసులో వ్యక్తి అరెస్టు