
ఉత్కంఠ పోరులో పోలీసులదే విజయం!
మేడికొండూరు: నిత్యం విధి నిర్వహణ, ప్రజాసేవలో తలమునకలై ఉండే రెవెన్యూ, పోలీస్ శాఖల అధికారులు, సిబ్బంది ఒక్కచోట చేరి క్రీడాస్ఫూర్తిని చాటారు. మేడికొండూరు మండలంలోని పేరేచర్ల మినీ స్టేడియం వేదికగా ఈ రెండు శాఖల మధ్య ఆదివారం స్నేహపూర్వక క్రికెట్ మ్యాచ్ ఉత్సాహభరిత వాతావరణంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ హాజరై, ఇరు జట్ల ఆటగాళ్లను పరిచయం చేసుకున్నారు. అనంతరం టాస్ వేసి మ్యాచ్‌ను ప్రారంభించారు.
హోరాహోరీగా సాగిన పోరు
మైదానంలోకి దిగిన ఇరు జట్ల ఆటగాళ్లు నువ్వా నేనా అన్నట్లు పోటీ పడ్డారు. బౌండరీలు, సిక్సర్లతో హోరెత్తించారు. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో చివరికి పోలీస్ జట్టు, రెవెన్యూ జట్టుపై గెలుపొందింది. అనంతరం, ఎస్పీ విజేతగా నిలిచిన పోలీస్ జట్టుకు ట్రోఫీని అందజేసి ప్రత్యేక అభినందనలు తెలిపారు. రన్నరప్‌గా నిలిచిన రెవెన్యూ జట్టు ఆటను కూడా ప్రశంసించారు.