
డ్రగ్స్ నివారణే ‘ఈగల్’ ధ్యేయం
తెనాలి రూరల్: ఏపీని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా చేయడమే ఈగల్ (ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్‌ఫోర్స్‌మెంట్) ముందున్న లక్ష్యమని ఈగల్ ఎస్పీ కె. నగేష్‌బాబు తెలిపారు. ఆ దిశగా విద్యాసంస్థల్లో డ్రగ్స్ వద్దు బ్రో అనే కార్యక్రమంతో అవగాహన కల్పిస్తున్నామని వివరించారు. స్థానిక వీఎస్సార్ అండ్ ఎన్‌వీఆర్ కళాశాలలో ఈ మేరకు మంగళవారం నిర్వహించిన సదస్సులో జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్, ఈగల్ టీం ఎస్పీ నగేష్‌బాబు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కళాశాల ఇన్‌చార్జ్ ప్రిన్సిపల్ డి. షీలా అధ్యక్షత వహించారు. సదస్సులో ఎస్పీ నగేష్‌బాబు మాట్లాడుతూ అవగాహన సదస్సులకు స్పందన లభించిందన్నారు. డ్రగ్స్ నిర్మూలిస్తే సగం నేరాలు తగ్గిపోతాయన్నారు. డ్రగ్స్ రహిత ఆంధ్ర ప్రదేశ్‌కు ప్రతి విద్యార్థి సహకరించాలన్నారు. గంజాయిపై ఎలాంటి సమాచారం ఉన్నా 1972 నంబరుకు కాల్ చేసి తెలియజేయాల్సిందిగా కోరారు. డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలు జీవితాలను నాశనం చేస్తున్నాయని వాపోయారు. పిల్లలపై తల్లిదండ్రులు నిఘా ఉంచాలని సూచించారు. జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలో గంజాయికి కేంద్రాలుగా ఉన్న 37 హాట్ స్పాట్లను గుర్తించామని తెలిపారు. వాటిలో తెనాలిలో ఏడు ఉన్నట్లు చెప్పారు. కార్యక్రమంలో డీఎస్పీ బి.జనార్దనరావు, కళాశాల సెక్రటరీ కరస్పాండెంట్ నన్నపనేని సుధాకర్, సీఈఓ నన్నపనేని భాస్కర్, డైరెక్టర్ భాగ్యలక్ష్మి, ఎన్‌వీఆర్ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఎన్‌బీవీ అజయ్, ఎన్‌సీసీ ఆఫీసర్ కె అశోక్, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.