
ఉద్దేశపూర్వకంగానే నాపై అభియోగాలు
పట్నంబజారు: ఎటువంటి ఆధారాలు లేకుండా తనపై అభియోగాలు మోపడం ఆశ్చర్యానికి గురి చేసిందని ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం ఆవేదన వ్యక్తం చేశారు. సిద్ధార్థనగర్‌లోని ఆయన కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బాపట్ల జిల్లా ఎస్పీకి వేముల మల్లికార్జునరావు తనపై ఫిర్యాదు చేశాడని, వ్యాపారంలో లావాదేవీల విషయంలో తానేదో ద్రోహం చేశానని చెప్పడం సబబు కాదని తెలిపారు. 2023 జులైలో గ్రానైట్ ఫ్యాక్టరీకి సంబంధించి మల్లికార్జునరావుతో ఒప్పందం చేసుకున్నామని చెప్పారు. తమ కంటే ముందే మల్లికార్జునరావు, ప్రేమ రాజు అనే వ్యక్తికి అగ్రిమెంట్ చేసి రూ. 60లక్షల వరకు తీసుకున్నాడని, ఆ తర్వాతే తన కుమారుడు మల్లికార్జునరావు వద్ద ఫ్యాక్టరీని లీజుకు తీసుకున్నట్లు ఏసురత్నం వివరించారు. ఈ క్రమంలో ఫ్యాక్టరీకి సంబంధించి వివాదం తన వద్దకు వచ్చిన నేపథ్యంలో ఇద్దరి మధ్యా సఖ్యత కుదిర్చి రూ 2.40కోట్లకు అగ్రిమెంట్ చేసుకున్నామని తెలిపారు. దానిలో భాగంగానే ప్రేమరాజుకు సుమారు 60లక్షల వరకు అప్పు ఉంటే, చాలా వరకు చెల్లించినట్లు వివరించారు. అప్పులు చెల్లించే క్రమంలో అగ్రిమెంట్‌లో స్పష్టంగా అనుకున్న గడువులోగా ఫ్యాక్టరీని అప్పగించాలని, లేనిపక్షంలో చెల్లించిన డబ్బులకు రూ. 2వడ్డీ ఇవ్వాలని స్పష్టంగా రాసుకున్నట్లు చెప్పారు. అనుకున్న సమయానికి తిరిగి డబ్బులు ఇవ్వకుండా మోసం చేసిన మల్లికార్జునరావు తనపై అభియోగాలు ఉద్దేశపూర్వకంగా చేస్తున్నాడని చెప్పారు. నాలుగు నెలల నుంచి పట్టాభిపురం పోలీసులు ఫోన్ చేస్తున్నా రావడం లేదని, ఒక్కసారిగా బయటకు వచ్చి తనపై ఫిర్యాదు చేయటం ఏంటని ఏసురత్నం ప్రశ్నించారు. తమ వద్ద అన్ని విధాలుగా రికార్డెడ్ ఎవిడెన్స్‌లు ఉన్నాయని, దీనిపై తాను కూడా జిల్లా కలెక్టర్, ఎస్పీలకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.
ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం ఆవేదన
ఆరోపణలు రుజువు
చేయాలని ఆగ్రహం