
ఘనంగా విజ్ఞాన్ చైర్మన్ రత్తయ్య పుట్టిన రోజు వేడుకలు
చేబ్రోలు: విజ్ఞాన్ విద్యాసంస్థల చైర్మన్ లావు రత్తయ్య జన్మదిన, ఫౌండేషన్ డే వేడుకలను సోమవారం వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్సిటీలో ఘనంగా నిర్వహించారు. విజ్ఞాన్ విద్యా సంస్థల్లో ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలను నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ రత్తయ్య మాట్లాడుతూ విద్యార్థులంతా జీవితంలో ఉన్నత స్థానాలను అధిరోహిస్తే తాను ఇంకా ఎక్కువ సంతోషిస్తామని తెలిపారు. సాధారణ ఆలోచనలతో కాకుండా క్రియేటివ్‌గా ఆలోచిస్తేనే విజయం సాధించగలరని విద్యార్థులకు సూచించారు. స్వేచ్ఛాయుత వాతావరణంలోనే విద్యార్థులు సరైన దిశగా ఎదగలగరనే సిద్ధాంతాన్ని తాను మొదటి నుంచి నమ్ముతున్నానని చెప్పారు. జీవితంలో ఎవరైనాసరే ఉన్నత స్థాయికి చేరాలంటే వారు ఎదుర్కొనే కష్టాలు, చేసే త్యాగాలను బట్టే వాళ్లకు ఫలితం లభిస్తుందని తెలిపారు. అనంతరం పుట్టిన రోజు కేక్ కట్ చేశారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాల్లో సత్తాచాటిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో హైదరాబాద్‌లోని అనంత్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సీఎండీ డాక్టర్ పావులూరి సుబ్బారావు, ఎన్విదా సీనియర్ ఏఎస్‌ఐసీ మేనేజర్ మౌనిక, వైస్ చాన్స్‌లర్ పి.నాగభూషణ్, వైస్ చైర్‌పర్సన్ ఎల్. రాణి రుద్రమదేవి, సీఈవో మేఘన కూరపాటి, రిజిస్ట్రార్ పి.ఎం.వి. రావు, సమన్వయకర్త గుదిమెళ్ల శ్రీకూర్మనాథ్, ఫణీంద్రకుమార్, శ్రీనివాసబాబు, మోహన్‌రావు పాల్గొన్నారు.
కేక్ కట్ చేస్తున్న రత్తయ్య