
ధర్మస్థల ఘటనలపై దర్యాప్తు వేగవంతం చేయాలి
లక్ష్మీపురం: కర్ణాటకలోని మంజునాథ దేవాలయం ధర్మస్థలలో వందలాది మంది యువతులు, మహిళలపై అత్యాచారం, హత్యోదంత ఘటనలు భయానకంతో పాటు తీవ్రమైన ఆందోళన కలిగిస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య (ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ)జిల్లా కార్యదర్శి రెంటాల కుమారి అన్నారు. గుంటూరు కొత్తపేటలోని సీపీఐ జిల్లా కార్యాలయం మల్లయ్య లింగంభవన్ నుంచి భగత్ సింగ్ విగ్రహం వరకు సోమవారం నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కర్ణాటక రాష్ట్రంలో మహిళలు, యువతులపై హత్యలు, అత్యాచారాల పరంపర మనసును కలిచి వేస్తోందని తెలిపారు. ఆశ్రమాలు, ఆలయాలు ఆధ్యాత్మిక చింతన, భక్తి పేరుతో మహిళలను వంచిస్తున్నాయని ఆరోపించారు. సమాజంలో పలువురు పెద్ద మనుషులుగా, మత గురువులుగా చలామణి అవుతూ మహిళల మాన ప్రాణాలను హరించివేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రభుత్వం ఆలస్యంగా ప్రత్యేక దర్యాప్తు బందాన్ని ఏర్పాటు చేసిందని విమర్శించారు. మహిళా సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెన్మెత్స దుర్గాభవాని మాట్లాడుతూ బీజేపీ నాయకులే మంజునాథ్ దేవాలయం ట్రస్టీలుగా ఉన్నారని, వారి కనుసన్నల్లోనే ఈ అరాచకాలన్నీ జరిగాయని తెలుస్తోందన్నారు. ధర్మస్థల ఉదంతంపై దర్యాప్తును వేగవంతం చేయాలని, దోషులను కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య డిమాండ్